Thursday, July 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజవాబుదారీతనం కావాలి..!

జవాబుదారీతనం కావాలి..!

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే కేవలం అధికారాన్ని వినియోగించే వ్యవస్థ కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండే, పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎన్నికల్లో గెలవడం అధికారాన్ని ఇస్తుంది. కానీ ఆ అధికారానికి నైతికతను, చట్టబద్ధతను, ప్రజల విశ్వాసాన్ని కల్పించేది జవాబు దారీతనం, సమర్థవంతమైన పాలన మాత్రమే. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తారు, కానీ ప్రశ్నించే హక్కును ఎప్పటికీ వదులుకోరు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతే ప్రజాస్వామ్యానికి అసలు ప్రాణం. ఇటీవలి కాలంలో దేశంలో ఏదైనా పెద్ద వివాదం జరిగినప్పుడల్లా కొత్త చట్టాలను తీసుకురావడం ప్రభుత్వాల సహజ ప్రతిస్పం దనగా మారింది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌లు, నియామ కాలలో అవకతవకలు, ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులు, సైబర్ నేరాలు. ప్రతి సమస్యకు కొత్త చట్టమే పరిష్కారమన్న భావన పెరుగుతోంది. కానీ ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న వేరేది. ఇప్పటికే ఉన్న చట్టాలను ఎంత సమర్థంగా అమలు చేశాం? నేరం చేసినవారిని ఎంత వేగంగా శిక్షించాం? ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిజాయితీగా పనిచేసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించకపోతే కొత్త చట్టాలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేవు. నేరాలను అరికట్టేది కేవలం కఠిన శిక్షలు కావు, తప్పు చేసినవారిని తప్పకుండా చట్టం శిక్షిస్తుందనే నమ్మకం.

అదే ప్రజాస్వామ్యంలో న్యాయపాలనకు పునాది. పరీక్షలలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తీసుకొచ్చింది. ప్రశ్నాపత్రాల లీక్‌లు, పరీక్షల్లో మోసాలు, నిర్వాహకుల కుమ్మక్కు వంటి అక్రమాలను అరికట్టడమే దీని ఉద్దేశం. కఠిన శిక్షలు, భారీ జరిమానాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ చట్టం వచ్చిన తర్వాత కూడా వివిధ పరీక్షలపై వివాదాలు కొనసాగితే ప్రజల్లో సహజంగానే ఒక సందేహం తలెత్తుతుంది. సమస్య చట్టంలో ఉందా? లేక అమలులో ఉందా? దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ వంటి ప్రవేశ పరీక్షలపై తలెత్తిన వివాదాలు, ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు, అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టడం, ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఇవన్నీ పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కుదిపేశాయి. ప్రతి విద్యార్థి తన ప్రతిభతోనే ముందుకు రావాలని కోరుకుంటాడు. కానీ పరీక్షా ప్రక్రియపైనే అను మానాలు వ్యక్తమైతే, దెబ్బతినేది కేవలం ఒక పరీక్ష కాదు, మొత్తం వ్యవస్థపై నమ్మకం.

అదే విధంగా మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వ్యాపం (వ్యావసాయిక్ పరీక్ష మండల్ – Vyavsayik Pariksha Mandal) కుంభకోణం భారతదేశంలో పరీక్షా వ్యవస్థ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటి. వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో అక్రమాల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అంటే కేవలం తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయడం కాదు. తప్పు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మళ్లీ జరగకుండా ఎలాంటి సంస్కరణలు చేపట్టారు? అనే ప్రశ్నలకు ప్రజల ముందే సమాధానం చెప్పడం. ప్రభుత్వం చేసే ప్రతి పని చట్టబద్ధమే కావచ్చు. కానీ చట్టబద్ధతతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా సంపాదించాలి. ప్రభుత్వ నిధులు, ప్రత్యేక నిధులు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, నియామక వ్యవస్థలు-ఇవన్నీ సాధ్యమైనంత పారదర్శకంగా ఉండాలి. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రశ్నలకు సమాధానం చెప్పే సంస్కృతి పెరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమాచారం దాచడం అనుమానాలకు దారితీస్తుంది, సమాచారం పంచుకోవడం విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే పాలకులు కాదు, ప్రజల సేవకులు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ప్రజలదే.

ప్రజలు ఐదేండ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా అధికారాన్ని అప్పగిస్తారు. కానీ ఆ అధికారాన్ని ప్రజల తరఫున, ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన బాధ్యత మాత్రమే ఎన్నికైన ప్రభుత్వాలకు ఉంటుంది. అందుకే మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, గ్రామ సర్పంచ్ అయినా, చివరకు ప్రభుత్వ ఉద్యోగి అయినా, అందరూ ప్రజలకు జవాబుదారులే. కానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రాథమిక సూత్రం మరచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ‘ప్రజాసేవే మా ధ్యేయం’ అని చెప్పే నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ఇష్టపడని పరిస్థితి ఏర్పడితే, ప్రజాస్వామ్యం క్రమంగా కేవలం ఎన్నికల వ్యవస్థగా మాత్రమే మిగిలిపోతుంది. పాలకుడు ధర్మబద్ధంగా, న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరించినప్పుడే ప్రజల విశ్వాసం లభిస్తుంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజును నిరంతరం పర్యవేక్షిం చాల్సిన అవసరాన్ని ప్రస్తావించాడు. అధికారంలో ఉన్నవారికి జవాబుదారీతనం లేకపోతే అవినీతి పెరుగుతుందని ఆయన వేల సంవత్సరాల క్రితమే హెచ్చరించాడు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడా రాజ్యాంగ సభలో ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ‘‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యక్తులు మంచివారు కాకపోతే అది కూడా విఫలమవుతుంది’’అని ఆయన అన్నారు. ఈ మాటలు నేటికీ అంతే ప్రాసంగికంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం చట్టాల పుస్తకం కాదు, వాటిని నిజాయితీగా అమలు చేసే వ్యవస్థ. ఒక తప్పు జరిగితే ముందుగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం కాకుండా, వాస్తవాలను ప్రజలకు వెల్లడించడం, స్వతంత్ర విచారణకు సహకరించడం, బాధ్యులపై వేగంగా చర్యలు తీసుకోవడం ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది.ఆ విశ్వాసం నిలబడేది పారదర్శకత, నిజాయితీ, సమాన న్యాయం, రాజ్యాంగ విలువల పట్ల అచంచల నిబద్ధత ఉన్నప్పుడే. అది నేడు దేశ పాలనలో లోపిస్తోంది. అందుకే జవాబుదారీతనం కావాలి, పెరగాలి.

సిహెచ్.వి. ప్రభాకర్ రావు,
9391533339

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -