విలేకరుల సమావేశంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే ఆరోపణ
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆరోపించారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి శూన్యమే మిగిలిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మోసపూరితమైన వీటిలో ఏది కూడా అమలుపరచడం లేదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బిసి రిజర్వేషన్ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన 60% కాలం గడిచిందని అన్నారు. రైతు బంధు పథకం ఇప్పటివరకు ఆరుసార్లు రావాల్సి ఉండగా నాలుగుసార్లు మోసం చేసిందని అన్నారు.
నాగమడుగు ఎత్తిపోతల పథకం ముందుకు సాగడం లేదని, అంతర్రాష్ట్ర లేండి ప్రాజెక్టు పనులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అన్ని మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఏ ఒక్క మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగడం లేదని అన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు. జుక్కల్ అభివృద్ధికి నిధులు కేటాయింపులు ఎమ్మెల్యే పట్టింపు లేదని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలు కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు.
బీసీల కోసం ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఈపాటికి మూడుసార్లు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.20,000 కోట్లు కూడా కేటాయించలేదని, మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బన్సీ పటేల్, పాకల విజయ్, సుల్తాన్, సురేష్, కృష్ణ, పటేల్, పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



