Friday, July 31, 2026
E-PAPER
Homeజాతీయంకోవిడ్ గుణపాఠం నేర్వని మోడీ సర్కారు

కోవిడ్ గుణపాఠం నేర్వని మోడీ సర్కారు

- Advertisement -

భవిష్యత్ మహమ్మారుల సన్నద్ధతపై కేంద్రం నిర్లక్ష్యం
ఇలాంటి వ్యాధుల నివారణ పరిశోధనకు ప్రత్యేక నిధుల్లో పూర్తి కోత
2026-27లో ఒక్క రూపాయీ కేటాయించని వైనం
ఏటికేడూ బడ్జెట్‌‌లో కోతలు విధిస్తూ వచ్చిన ప్రభుత్వం
ఎన్డీఏ సర్కారు తీరుపై నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 మహమ్మారి దేశ ఆరోగ్య వ్యవస్థలో బలహీనతలను బట్టబయలు చేసినప్పటికీ మోడీ సర్కారు దాని నుంచి గుణపాఠం నేర్చినట్టు కనిపించటం లేదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు, అంటువ్యాధులను ఎదుర్కొనే పరిశోధనకు అవసరమైన ప్రత్యేక నిధులను కేంద్రం పూర్తిగా ఎత్తివేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు ఆరోగ్య పరిశోధన బడ్జెట్‌‌ పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం.. మరోవైపు మహమ్మారుల నివారణ, ముందస్తు గుర్తింపు, పర్యవేక్షణ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పరిశోధన పథకానికి 2026-27 బడ్జెట్‌‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. ​జులై 21న రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రజాప్రావ్‌ ‌జాధవ్‌ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. ఆరోగ్య పరిశోధన శాఖ (డిపార్ట్‌‌మెంట్‌ ఆఫ్‌ ‌హెల్త్‌ ‌రీసెర్చ్‌-డీహెచ్‌ఆర్‌) ‌బడ్జెట్‌ 2023-24‌లో రూ.2, 892 కోట్ల నుంచి 2026-27లో రూ.4,821. 21 కోట్లకు పెరిగింది. నాలుగేండ్లలో దాదాపు 67 శాతం పెరిగిన ఈ బడ్జెట్‌‌ను ప్రభుత్వం ఒక విజయంగా ప్రచారం చేసుకుంది. అయితే ‘వ్యాధుల వ్యాప్తి, మహమ్మారులను నివారించేందుకు అవసరమైన సాధనాల అభివృద్ధి, మద్దతు’ పేరుతో ఉన్న ప్రత్యేక పథకానికి నిధులను పూర్తిగా నిలిపివేయడం విరుద్ధ సంకేతాలను ఇస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలూ బేఖాతరు
​కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తం గా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న విషయం విదితమే. ఇది ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలను కుదేలు చేసింది. ప్రస్తుతం కూడా ఎంపాక్స్, హెచ్5ఎన్1
పక్షుల ఫ్లూ వంటి కొత్త అంటువ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులను ముందుగానే గుర్తించే వ్యవస్థలు, వేగవంతమైన నిర్ధారణ సాంకేతికత, పరిశోధనలపై నిరంతర పెట్టుబడులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా పదేపదే హెచ్చరిస్తోంది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ప్రత్యేక పరిశోధన నిధిని నిలిపివేయడం ఆందోళనకరమని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సమర్థించుకుంటున్న కేంద్రం
ప్రభుత్వం మాత్రం మహమ్మారుల సన్నద్ధతకు ఇతర పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నామని సమర్థింపులు చేసుకుంటోంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద బయోసెక్యూరిటీ సన్నద్ధత, మహమ్మారి పరిశోధనలు, నేషనల్ వన్ హెల్త్ మిషన్ కోసం 2026-27లో రూ.351.06 కోట్లు, వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీస్ (వీఆర్‌‌డీఎల్‌) పథకానికి రూ.70 కోట్లు, వైద్య కళాశాలల్లోని మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్స్ (ఎంఆర్‌‌యూలు) కోసం రూ.100.27 కోట్లు కేటాయించినట్టు ప్రచారం చేసుకుంటోంది.

​పథకం కొనసాగింపు పైనా స్పష్టత కరువు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రత్యేక పథకాన్ని నిలిపివేశారా లేదా దాని కార్యకలాపాలను ఇతర పథకాలలో విలీనం చేశారా అన్నది మాత్రం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కోవిడ్ మహమ్మారి నేర్పిన గుణపాఠాలను మర్చిపోయి.. ప్రత్యేక అంటువ్యాధుల నివారణ పరిశోధనకు నిధులు నిలిపివేయడం ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజారోగ్య భద్రతను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనాతో పాటు మరికొన్ని వ్యాధుల వ్యాప్తి ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికైన జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏటికేడూ నిధుల్లో కోతలు
ఈ పథకానికి కేంద్రం బడ్జెట్‌‌ను ఏటికేడూ కోతను విధిస్తూ వస్తోంది. 2023-24లో రూ.10 కోట్లు, 2024-25లో రూ.8 కోట్లు కేటాయించిన మోడీ సర్కారు.. 2025-26లో రూ.3.67 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇక 2026-27లో మాత్రం ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం గమనార్హం. కొత్త నిర్ధారణ పరీక్షలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, అంటువ్యాధుల పర్యవేక్షణ, నియంత్రణకు అవసరమైన పరిశోధనలకు ఈ పథకం మద్దతు అందించేది. కొత్తగా ఉద్భవించే, మళ్లీ వ్యాపించే అంటువ్యాధులను ముందుగానే అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యం.

భవిష్యత్తు పరిశోధనలపై 
ప్రతికూల ప్రభావం
అయితే వైద్య, ఆరోగ్య నిపుణులు మాత్రం కేంద్రం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం ఒక అంశమైతే, భవిష్యత్ మహమ్మారులను అడ్డుకునే కొత్త సాంకేతికతలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మరో అంశమని చెప్తున్నారు. అలాంటి ప్రత్యేక పథకాన్ని రద్దు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనే పరిశోధనలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -