హైరైజ్ భవనాల గుర్తింపు,సెట్‌బ్యాక్ సడలింపులు
మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ భవన నిర్మాణ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. హై రైజ్ భవనాల గుర్తింపు, సెట్‌బ్యాక్ సడలింపులు వంటి నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ ‘తెలంగాణ బిల్డింగ్ రూల్స్ – 2012’కు కీలక సవరణలు చేస్తూ ఈమేరకు ఆదివారం జీవోనెంబర్ 95ను విడుదల చేశారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ సవరణలు రాష్ట్ర నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త నిబంధనలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్‌గా గుర్తించింది. (పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను లెక్కలోకి తీసుకోరు). 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో టీడీఆర్ ద్వారా ఎత్తు పెంపుదలకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ హై-రైజ్ భవనాలకు సెట్‌బ్యాక్ సడలింపునకు అవకాశం కల్పించింది. హై-రైజ్ భవనాల్లో 10శాతం వరకు సెట్‌బ్యాక్ సడలింపునకు కూడా అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు మారితే టీడీఆర్ లేదా ఛార్జీలు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతినిచ్చింది.
40 ఫీట్ల రోడ్డుపై మూడు అంతస్తులు అదనంగా నిర్మాణం చేసుకునేందుకు వెలుసులుబాటునిచ్చింది. 60 ఫీట్ల రోడ్డుపై నాలుగు అంతస్తులు అదనంగా నిర్మించుకునేందుకు నిబంధనలు సడలించింది. 80 ఫీట్ల రోడ్డుపై ఐదు అంతస్తులు వరకు అవకాశాన్ని కల్పించింది. 10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్‌లో 3 శాతం టీడీఆర్ తప్పనిసరి అని నిబంధన పెట్టింది. 20 అంతస్తులపై భవనాలకు ఐదుశాతం టీడీఆర్ తప్పనిసరి ఉండాలని జీవోలో పేర్కొంది. బిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50శాతం టీడీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. అక్యూఫై సర్టిఫికెట్ (ఓసీ)కు ముందు మిగతా 50 శాతాన్ని చెల్లించాల్సి ఉన్నది.



