నవతెలంగాణ-కుభీర్
ఎన్నో ఏళ్ల కాలం నుంచి గ్రామంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ఉండేవి. వీటివలన ప్రజలు, మూగ జీవాలు ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. గ్రామానికి ఎంతమంది ప్రెసిడెంట్ లు మారినా ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ సమస్యను గ్రహించిన సర్పంచ్ అగ్గు మారుతీ వెంటనే పరిష్కార చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని రోజుల కిందట విద్యుత్ శాఖ అధికారులను కలిసి సమస్యను వివరించారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆదివారం గ్రామాన్ని సందర్శించి, కిందికి వేలాడిన విద్యుత్ తీగలను పరిశీలించారు. సమస్యను పరిష్కరించాలంటే ముఖ్యంగా గ్రామంలో ఉన్న లూస్ లైన్లను తొలగించాలని వారు సూచించారు.
ఈ క్రమంలో సర్పంచ్ ఆధ్వర్యంలో 9 మీటర్ల ఎత్తు 18 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటు గెలిపించారని గుర్తు చేశారు. వారి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా అంతే చిత్తశుద్ధితో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. విద్యుత్ సమస్యను పరిష్కరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏండ్లనాటి సమస్యను సర్పంచ్ తక్కువ సమయంలో పరిష్కరించారని గ్రామస్తులు ప్రశంసించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గోనెకర్ రాజు, ఆడెప్ప, గోసుల శారదా, నారాయణ పంచాయతీ కార్యదర్శి బి.రమేష్, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



