అమలుకు విద్యాశాఖ ఆదేశాలు..
నవతెలంగాణ – మల్హర్ రావు
టీచర్లకు టిఫిన్ మధ్యాహ్న భోజనం వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.అయితే విద్యార్థులకు ఈ ఏడాది జూన్ 12 నుంచే అల్పాహారం ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ,రెండు నెలలు కావొస్తున్నా ఆచరణకు నోచుకోలేదు.నాణ్యమైన భోజనం,టిఫిన్,పాలు ఇస్తామని చెప్పారు.ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు సైతం భోజనం,టిఫిన్‌కు అవకాశం కల్పిస్తే,వాటి నాణ్యత బాగుందన్న అభిప్రాయం సమాజంలోకి వెళ్తుందని,అందరూ సమానమనే భావన కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు.అయితే పథకం ప్రారంభంపై స్పష్టత కరువైంది.మండలంలో మొత్తం 34 ప్రభుత్వ పాఠశాల్లో మొత్తం 152 మంది టీచర్లు ఉండాలి,కానీ ప్రస్తుతం 126 మంది టీచర్లు ఉన్నారు.వీరు కూడా విద్యార్థులతో పాటు టిఫిన్,మధాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది.రోజుకో రకం టిఫిన్లు ఇచ్చేలా మెనూ రూపొందించారు.ఇడ్లీ,బోండా,ఉప్మాతో పాటు కిచిడి,వెజ్ బిర్యానీ,పులిహోర, విజయ డెయిరీ పాలు,రాగి జావ ఇవ్వనున్నారు.
అల్పాహారం ఎప్పుడో?..
ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ప్రకటించినా,ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.ప్రస్తుతం కొనసాగుతున్న వంట ఏజెన్సీలతో బ్రేక్ ఫాస్ట్ కార్య క్రమం అమలవుతుందా..? లేదా అనే సంశయంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.జిల్లా కేంద్రాల్లో హరేకృష్ణ ఛారిటీ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటిని పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.



