కథా సాహిత్యాన్ని చిరునామాగా చేసుకొని కృషి చేస్తున్న డాక్టర్ బి.వి.ఎన్.స్వామి కలం నుండి ప్రయోగాత్మకంగా’ కశప'(కథా శతక పద్యం) అనే పేరున రెండు పుస్తకాలు వెలువడ్డాయి. కథారచన, కథా విమర్శ, కథా పరిశోధనలను ప్రాణంగా భావించి పనిచేస్తున్న బివియన్ స్వామితో కాసేపు…
కథ అంటే మీకెందుకు ఇంత ప్రేమ
కష్ట సుఖాలను కలబోసుకోవడానికి మనుషులు కరువయ్యారు. వాటిని కాగితంపై ఒలకటానికి కథ అనుమతించింది. అందుకే కథ అంటే ఇష్టం.
కనిపించని సామాజిక సంక్లిష్టతను కథ ఏ విధంగా చిత్రిస్తుంది
సంక్లిష్టత బహురూపులది. కథకుడి అవగాహన, దృక్పథాల ఆసరాతో సంక్లిష్టతను కథ బట్టబయలు చేస్తుంది. స్వాంతన చేకూరుస్తుంది.
కథలు రాసుకునే మీరు కశప లాంటి ప్రయోగం ఎందుకు చేశారు
ఎవరి కథ వారు రాస్తున్నారు. ఆ మేరకు కథ విస్తరిస్తున్నది. అది వస్తు విస్తరణ. ఇప్పటికున్న రూపాయలకు మరొక రూపాన్ని జతపరిస్తే రూప విస్తరణ జరుగుతుందని ప్రయోగం చేశాను.
ఇందుకు మీకు స్ఫూర్తి కలిగించినది ఏమిటి
వచన కవిత్వంలో కొత్తగా పుట్టుకొచ్చే రూపాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. నేను సైతం ఒక రూపాన్ని కథకు అందించాలనుకున్నాను.
అవి రూపాలు కాదు ప్రక్రియలు. మీరు అందించినది ఏమిటి
ప్రాచీన సాహిత్యంలో పద్యం చెప్పి అర్ధతాత్పర్యాన్ని (సారాంశాన్ని) గద్యంలో చెప్పారు. నేను కథ (గద్యం) రాసి దాని సారాంశాన్ని శతక పద్యంలో చెప్పాను. ఇది గద్యపద్యాల కలయిక.మిశ్ర రూపం.
కశప’ నిర్మాణం గురించి తెలపండి.
కథ సాధ్యమైనంత చిన్నగా ఉండాలి. కథ చివరన కథా సారాంశాన్ని తెలిపే మకుట సహిత శతక పద్యం ఉండాలి. పద్య మూడవ పాదం లోని పదం కథకు శీర్షికగా ఉండాలి. శీర్షికా పదం కథలో ఉపయోగించాలి. ఒకటి లేదా రెండు పాత్రలతో కథ నడపాలి. నేను రాసిన 225 కశప కథలలో ‘బుంగి’ ప్రధాన పాత్ర. అలా పాత్రకు (బుంగి) కథాసాహిత్యంలో సుస్థిర స్థానం దొరికింది.
కశప, కశప-2 అనే రెండు పుస్తకాలు వెలువరించారు. వాటి మధ్య ఏమైనా తేడా ఉందా
నన్ను కదిలించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, అస్తిత్వ అనుభవాలను, భావావేశ సన్నివేశాలను, చారిత్రక, పౌరాణిక సంఘటనలను, ఆధునిక సమస్యలను, సమస్త దురాచారాలను, చిన్న కథలుగా మలుస్తున్న క్రమంలోనే వాటి సారాంశ రూపంగా ఉన్న వేమన శతక పద్యాలు స్ఫురించేవి. ఆ క్రమం నన్ను ఆలోచనలో పడవేసింది. కథ కింద శతక పద్యం కూర్చితే కొత్తగా అనిపించింది. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు శతక కారుల మకుట సహిత శతక పద్యాలను వెతికి అందులో నుండి కథను ప్రతిబింబించే పద్యాలను కథకు జోడించి 117 కశప కధల్ని రాసి 2017 లో విడుదల చేశాను. అది చాలామంది మన్ననలను పొందినది. పద్యాలను ఎన్నుకొని కథలు రాశాడు అని ఒకరిద్దరూ అన్నారు. నాకది అపవాదుగా తోచింది. ఫలితంగా కశప-2 పురుడు పోసుకుంది. ఇందులో కథ మరియు శతక పద్యం నేనే రాసాను.” కశప చెప్పిన కథనం కాంతి పధము”అనే మకుటంతో మొత్తం 108 తేటగీతి పద్యాలు, కథలు రాసి 2025 లో విడుదల చేశాను.”కశప”కథలు కొన్ని పత్రికల్లో “కాలమ్”గా వచ్చాయి. కొందరు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేశారు. ముందు మాటల్లో “కశప” ఉనికిని సాహితీవేత్తలు స్థిరపరిచారు.
ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఏమిటి
చదువుకోడానికి కథ, పాడుకోవడానికి పద్యం ఏకకాలంలో రెండు ప్రక్రియలను పాఠకులకు అందించడమే ప్రయోజనం. బాలలకు నీతి, పెద్దలకు సంస్కరణ దృష్టి అందించగల మిశ్రరూపం”కశప”. కథా సాహిత్యానికి ఇదొక చేర్పు.
వేణుశ్రీ



