Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలి

మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలి

- Advertisement -

తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ
చేప, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116కోట్లు కేటాయింపుపై హర్షం
నవతెలంగాణ – ముషీరాబాద్

​ప్రతి మత్స్య సొసైటీ ఖాతాలోనూ నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేప రొయ్య పిల్లల పంపిణీ కోసం రూ.116 కోట్లు కేటాయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ ఏడాది జూన్ 18న మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల్ కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. జులై 10న రంగారెడ్డి జిల్లా కోహెడ హోల్‌సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లామని గుర్తు చేశారు. జులై 20న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. మత్స్యకారుల ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలు నాసిరకంగా ఉండటంతో అవి 100 నుంచి 200 గ్రాముల కంటే ఎక్కువగా ఎదగడం లేదని తెలిపారు. దీంతో మత్స్యకారులకు ప్రయోజనం లేకుండా, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, కొందరు మత్స్యశాఖ అధికారులకే లాభం చేకూరుతోందని చెప్పారు. చేప పిల్లల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎలాంటి అవినీతికీ తావులేకుండా మత్స్యకారులకు రావాల్సిన నిధులను నేరుగా మత్స్య సొసైటీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల అమరావతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పు పద్మ, బక్కి బాలమణి, రాష్ట్ర కమిటీ సభ్యుడు తడబోయిన కృష్ణమూర్తి, హైదరాబాద్ జిల్లా నాయకుడు గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -