Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

- Advertisement -

తెలంగాణ ఆయుష్ హౌస్ 
సర్జన్స్ అండ్‌ పోస్ట్ 
గ్రాడ్యుయేట్స్ జేఏసీ పిలుపు
నవతెలంగాణ – బంజారాహిల్స్‌

​ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్కాలర్ల సమస్యల పరిష్కారం, ‌స్టైఫండ్‌ పెంపు కోసం మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. శ్రవణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్ల స్టైఫండ్ పెంపు కోసం పదేండ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. పదేండ్లలో జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణం, విద్య తదితర ఖర్చులు భారీగా పెరిగినా, ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌తో కనీస అవసరాలను కూడా తీర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. సమస్య పరిష్కారం కోసం వందలాది వినతిపత్రాలు సమర్పించినా, పలుమార్లు ప్రభుత్వ హామీలు వచ్చినా అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్లకు అందుతున్న స్టైఫండ్ దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉందని చెప్పారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే విభాగానికి రెండింతలకు పైగా స్టైఫండ్ అందుతున్నప్పటికీ, సమానమైన వైద్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ వైద్యులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అసమానతలను ప్రభుత్వం వెంటనే తొలగించి స్టైఫండ్‌ పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎం. రాకేష్, డాక్టర్ జి. అఖిల్ కుమార్, డాక్టర్ నవనీత్ కుమార్, డాక్టర్ ప్రైస్ ఏంజిల్, డాక్టర్ చాముండేశ్వరి, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -