గీతన్నల చైతన్యయాత్రలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మరిపెడ
గీత కార్మిక సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్ల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘గీత వృత్తిలో అమరుల యాది’ చైతన్యయాత్ర సోమవారం రెండవరోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం మండలాల్లో పర్యటించి మరిపెడ మండల కేంద్రానికి చేరుకుంది. ఆయా మండలాల్లో ఈ యాత్రకు ప్రజాసంఘాలు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మరిపెడలోని స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద జరిగిన సభలో రమణ మాట్లాడారు. కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుంచి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గీత కార్మికులకు పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని, ప్రమాదాల్లో గాయపడిన, మరణించిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50ఏండ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కొత్తగా ఎవరి దరఖాస్తులు స్వీకరించడం లేదన్నారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించి వారికి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వృత్తిలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సభ్యత్వం కలిగిన వాళ్లు 2లక్షల 30వేల మంది ఉండగా కేవలం 30వేల మందికే ఇచ్చారని, వృత్తి చేసే వారందరికీ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాలు చొప్పున భూమి ఇవ్వాలని, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. నందనంలోని నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో నీరాకు కేటాయించిన రూ.25కోట్లు, సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో.. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య, సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాణాల రాజన్న, రైతు సంఘం నాయకులు అనంతచారి ఉన్నారు. ఈ యాత్రలో.. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌనీ వెంకన్న, యమగాని వెంకన్న, నాయకులు బిక్కి వెంకటేశ్వర్లు, గౌని సాంబయ్య, బుర్ర సుధాకర్, తాళ్ల పెళ్లి నరసయ్య, మండల అధ్యక్షకార్యదర్శులు వీరగాని శ్రీనివాస్, మొగుళ్ల యాకన్న, సోషల్ మీడియా ఇన్‌చార్జి బోడపట్ల రాజశేఖర్, వివిధ గ్రామాలకు చెందిన గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



