Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి

సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి

- Advertisement -

ఆదివాసుల భారీ ర్యాలీ, ధర్నా
1/70 పీసా చట్టాల 
పటిష్ట అమలుకు డిమాండ్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

​ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఏజీఎస్‌(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం), రాయిసెంటర్‌ సార్మేడీలు, పటేల్స్‌, సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అధికారికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ.. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించి 5వ షెడ్యూల్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ నిర్మించాలని, 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో వందశాతం గిరిజన రిజర్వేషన్‌ కల్పించే జీఓ 3ను పునరుద్ధరించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన సాత్నాల మండలంలో వందశతం ఆదివాసీ జనాభా కలిగిన గిరిజన గ్రామాలు ఉన్నందున ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని అన్నారు. దీని కోసం ఇప్పటికే 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇచ్చినా.. పట్టించుకోకుండా అధికారులు నాన్‌ ఏజెన్సీ ప్రాంతంలో భవనాల నిర్మాణ పనులకు ఆర్డర్‌ జారీ చేయడం తగదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్‌ తన ఆర్డర్‌ మార్చి ఏజెన్సీ భూభాగంలోనే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. ఏకలవ్య గురుకుల పాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేసి గిరిజనులకు వైద్యం అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రవికుమార్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్‌ మండలంగా గుర్తించకపోతే ఏజెన్సీ సాధనకు సాత్నాల నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గిరిజన చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆదివాసులను అడవులకు దూరం చేసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ ప్రజల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్‌ సార్మేడీ సోనేరావు, వివిధ గ్రామాల పటేళ్లు, సర్పచులు పెందూర్‌ ఇస్తారి, ఆత్రం నగేష్‌, వెల్లది జీజాబాయి, చరణ్‌, పర్చకి లక్ష్మి, కాలురాం, శ్యామ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్న, కిరణ్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, ఎన్‌పీఆర్‌డీ జిల్లా కార్యదర్శి అరిఫా, టీఏజీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షలు కొట్నాక్‌ సక్కు, మండల అధ్యక్షులు విశాల్‌, కార్యదర్శి పెందూర్‌ గోవింద్‌, రాజ్‌గోండ్‌ సేవా సమితి నాయకులు తానాజీ, పెందూర్‌ మోహన్‌, ఏఎస్‌పీ నందు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -