నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని స్థానిక సాహితీ జూనియర్ కళాశాలలో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెస్ కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయలేదని విమర్శించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పరకాల పట్టణంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడిగా బొజ్జ హేమంత్, కార్యదర్శిగా మహమ్మద్ అప్రోజ్, ఉపాధ్యక్షుడిగా దోమటి విశ్వంత్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు సన్నీ, విద్యార్థులు పాల్గొన్నారు.



