నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఐ (UPI) లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూపీఐ సేవలను ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తోందని, అందువల్ల వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలు అందుతున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు, సాంకేతిక నిర్వహణ, భద్రత వంటి అంశాలకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని అన్నారు.
కాగా, ఇప్పటికే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలు స్వీకరించే కొన్ని యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలని భావిస్తోంది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు .రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై మాత్రమే స్వల్ప ఎమ్‌డీఆర్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యక్తుల మధ్య జరిగే సాధారణ యూపీఐ నగదు బదిలీలపై ఎలాంటి ప్రభావమూ ఉండదని సంబంధిత వర్గాల సమాచారం.



