– 24 ఎకరాల ఆక్రమణలపై ఐబీ అధికారుల చర్యలు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలం పాకలగూడెం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో వెనుక కుంట చెరువు పాత హద్దుల సర్వే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు ప్రారంభమైంది. పూర్వీకుల కాలంలో 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చెరువు ద్వారా సుమారు 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేది. అయితే చింతలపూడి మండలం చింతంపల్లికి చెందిన కొందరు వ్యక్తులు చెరువు భూమిని ఆక్రమించారని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 24 ఎకరాలు ఆక్రమణకు గురికావడంతో ప్రస్తుతం చెరువు కేవలం 8 ఎకరాలకే పరిమితమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సుదీర్ఘ సమస్యపై పాకలగూడెం గ్రామ పంచాయతీ పెద్దలు, రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులను ఆశ్రయించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కు వినతిపత్రం సమర్పించి చెరువు భూములను కాపాడాలని కోరారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి తక్షణమే విచారణ జరిపి హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీస్, నీటిపారుదల (ఐబీ) శాఖ అధికారులు రంగంలోకి దిగి పాత హద్దుల సర్వే చేపట్టారు. చెరువు అసలు విస్తీర్ణమైన 32 ఎకరాలను సమగ్రంగా కొలతలు వేసి ఆక్రమణల వివరాలను సేకరించారు. సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు అందజేస్తామని ఐబీ అధికారులు తెలిపారు. ఆక్రమణలను తొలగించి వెనుక కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆయకట్టు రైతుల కోరుతున్నారు.
నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే తమ సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల త్వరిత స్పందన పట్ల సత్యనారాయణపురం, పాకలగూడెం నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ఐబీ, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, ఆయకట్టు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



