Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగీత కార్మికుల పింఛన్‌ రూ.4వేలు ఇవ్వాలి

గీత కార్మికుల పింఛన్‌ రూ.4వేలు ఇవ్వాలి

- Advertisement -

 ప్రభుత్వ హామీలు 
అమలు చేయాలి
ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు చెల్లించాలి : అమరవీరుల యాది సభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, గీత కార్మికుల వృత్తి పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాటి చెట్టు పైనుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికులకు సంబంధించి ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. అమరవీరుల యాదిలో ఈ నెల 2న మహబూబాబాద్‌లో ప్రారంభమైన గీతన్నల చైతన్య యాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. పీఎస్‌ఆర్ సెంటర్, పూల సెంటర్, పోస్టాఫీస్, కోర్టు సెంటర్, పాత బస్టాండ్ మీదుగా మోకు, ముస్తాదులు, తాటి, ఈత కొమ్మలను చేత పట్టుకుని మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో వెంకటేశ్వర్లు ప్రసంగించారు. ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. తాటి, ఈత చెట్లను నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గీత సొసైటీకీ ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, కోటి వరాల పథకంలో కల్లుగీత సొసైటీలకు కేటాయించిన భూములకు ఫెన్సింగ్, నీటి సౌకర్యం కల్పించి తాటి, ఈత, ఖర్జూర మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ మాట్లాడుతూ.. నీరా పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సర్వాయిపేట, తాటికొండ, కిలాసాపురం తదితర కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాష్ట్ర నాయకులు చౌగాని సీతారాములు, గౌని వెంకన్న, కొండం కరుణాకర్, మడ్డి అంజిబాబు, గౌని సాంబయ్య, జిల్లా నాయకులు తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, బత్తుల జనార్ధన్, బోడపట్ల జయమ్మ, జెర్రిపోతుల కృష్ణ, బట్టిపల్లి నాగమల్లయ్య, బోడపట్ల సుదర్శన్, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నరసయ్య, సురుగు రాజేష్ గౌడ్, గుండగాని శ్రీను, కలగాని సోమయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -