జయంతి సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ భావజాల వ్యాప్తికోసం జీవితాంతం కృషి చేసిన సిద్ధాంతకర్త, స్వయం పాలన స్వాప్నికుడు, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన కృషిని, త్యాగాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ, ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు కేసీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఒంటరి పోరాటం చేస్తున్న సందర్భంలో తన సలహాలు, సూచనలతో జయశంకర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి, సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ర్ట సాధనోద్యమం కోసం భావజాల వ్యాప్తి చేశారని తెలిపారు. ఆయన అస్తిత్వ ఆలోచనా విధానం తెలంగాణకు ఎల్లకాలం స్పూర్తిదాయకమేనని పేర్కొన్నారు.
ఆయన త్యాగాలను, కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో భూపాలపెల్లికి ఆయన పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని తెలిపారు. పదేండ్ల స్వయం పాలన అనంతరం తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడిందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ మేథావులు స్వీయ మానసిక ధోరణులకు గురికాకుండా, సామాజిక, సాంస్కృతిక, అస్తిత్వ పరిరక్షణను గస్తీకాసే సైనికుడిలా పనిచేయాలని కోరారు. తెలంగాణ యువత నిత్యం ప్రజలను చైతన్యం చేయడం ద్వారా మాత్రమే జయశంకర్ ఆశయాలను కొనసాగించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
జయశంకర్ స్ఫూర్తిదాయకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



