నవతెలంగాణ-ఆలేరు టౌన్
కల్లుగీత వృత్తిలో ప్రమాదాల నివారణ, రక్షణ, ఉపాధి, సంక్షేమం, ఆధునీకరణ కొరకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి, ఆగస్టు 2న మానుకోట నుండి హైదరాబాద్ ట్యాంక్బండ్ వరకు తలపెట్టిన గీతన్నల చైతన్య యాత్ర ఈనెల 9న ఆలేరు పట్టణానికి వస్తుందని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో గురువారం ఆ సంఘం నాయకులు గోడపత్రిక ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని, ప్రకటించిన విధంగా పెన్షన్ రూ.4000 ఎక్స్గ్రేషియా రూ.10 లక్షల పెంచాలని, ఎక్కడ ప్రమాదం గురైన వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారంగా 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. పెండింగ్ ఎక్స్గ్రేషియా డబ్బులు రూ.20 కోట్లు వెంటనే బాధితులకు చెల్లించాలని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న కోటి తాటి ఈత చెట్లకు నెంబర్లు వేసి చెట్లను రక్షించాలని, వీటిని తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు నీటి సౌకర్యం కల్పించి, పొట్టి తాటి, ఈత, ఖర్జూర చెట్లు నాటాలన్నారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, రాష్ట్ర బడ్జెట్లో నీరాకి రూ.25 కోట్లు, సంక్షేమానికి రూ.67 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. మీరా ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ఏరియాలలో గీతా కార్మికులందరికీ సభ్యత్వం ఇచ్చి సొసైటీలు టిఎఫ్టి లు చేసి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పారు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి రోజు ట్యాంక్బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. సర్వాయిపేట, తాటికొండ, ఖిలాషాపురం తదితర కోటలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లు గీతా కార్మిక సంఘం మండల కన్వీనర్ కోరుకొప్పుల కిష్టయ్య, రాష్ట్ర నాయకులు మొరిగాడు చంద్రశేఖర్, జిల్లా నాయకులు మొరిగాడి రమేష్, మండల నాయకులు మిట్ట శంకరయ్య, ఘనగాని మల్లేశం, దూసరి మురళి తదితరులు పాల్గొన్నారు.



