– ఉద్యమ నేత కత్తెరపల్లి దామోదర్
నవతెలంగాణ–గీసుగొండ
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ 17వ డివిజన్ అధ్యక్షుడు, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ మాజీ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్ ఉద్యమకారులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కత్తెరపల్లి దామోదర్ మాట్లాడుతూ, తెలంగాణకు జరిగిన అన్యాయాలను చారిత్రక ఆధారాలతో ప్రపంచానికి చాటి చెప్పి, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు.
తన చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నిస్వార్థంగా పనిచేసి, తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన గొప్ప మేధావి అని పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఆయన అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని, జయశంకర్ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి నడిచిన సందర్భాలను ఈ సందర్భంగా దామోదర్ స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ల్యాదేళ్ల బాలు, కంది శ్రీనివాస్ రెడ్డి, తరగల ప్రసాద్, రఘు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మారపాక రాజీవ్ గాంధీ, విజయ్, సముద్రాల శ్రావణ్ కుమార్, భైరపాక కరుణాకర్, నవీన్ల కిరణ్, మధుకర్, భాస్కర్, కోట్ల ప్రదీప్, సాగర్, వెంకటేష్, రవీందర్, ఉద్యమకారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



