నవతెలంగాణ – ఆర్మూర్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు శుక్రవారం ఎంపీడీవో శివాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తోందనీ, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు క్విట్ ఇండియా స్ఫూర్తితో పోరాడి భారతదేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆగస్టు10న రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో నిర్వహించాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించాయని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్తు సంస్కరణ బిల్లును 2025ను ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, 12 గంటల పని దినాన్ని రద్దు చేసి, 8 గంటల పనిదినాలను కొనసాగించాలని, విబీజీ రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏజెన్సీ, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ పాల్గొని జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు పోగుల నగేష్ గౌడ్, వడ్డెర వృత్తుల దారుల జిల్లా సంఘం అధ్యక్షులు ఇదగొట్టి సాయిలు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



