– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ – సత్తుపల్లి
ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో రైతు సంఘ మండల నాయకుడు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’ నిర్వహిస్తున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులపై దాడి చేస్తోందని విమర్శించారు. పరిశ్రమల అధిపతుల కోసం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి, పనిగంటలను 8 నుండి 12 గంటలకు పెంచారని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన విత్తన చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఏటా 200 రోజుల పని కల్పించి, రోజువారీ కనీస వేతనం రూ. 800 చెల్లించాలన్నారు.
కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. ఆగస్టు 10న సత్తుపల్లి మండల తహసిల్దార్ కార్యాలయ ముట్టడిలో కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు జాజిరి జ్యోతి, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, వ్యకాస మండల కార్యదర్శి కావ్వారపు లక్ష్మణరావు, నాయకులు బండి వేలాద్రి, ఎలగం రాములు, కొప్పుల చిన్నస్వామి, దాట్ల రాంబాబు, తడికమళ్ల రామకృష్ణ, కొత్తపల్లి రఘు, తోటకూర వెంకట్రావు, రామకృష్ణ పాల్గొన్నారు.



