అప్పుడే పరిశ్రమలు మరింత బలోపేతమవుతాయి :
పారిశ్రామికవేత్తల ‘హిప్లెక్స్-2026’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులను ఇబ్బందులుగా కాకుండా కొత్త అవకాశాలకు పునాదులుగా మలుచుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లోనే కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తాయన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘హిప్లెక్స్–2026’ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్‌పో-2026) అంతర్జాతీయ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పరిశ్రమల ప్రదర్శనల్లో తనకు యంత్రాలు మాత్రమే కనిపించవనీ, వాటి వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, దేశాభివృద్ధికి వారు చేస్తున్న శ్రమ, పారి శ్రామికవేత్తల సంకల్పం, యువత భవిష్యత్తు మాత్రమే కనిపిస్తాయని తెలిపారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు, విస్తరణ, కొత్త ఆవిష్కరణలను కొనసాగిస్తున్నారని, అదే మన దేశ బలమని చెప్పారు. ప్లాస్టిక్స్, పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని తెలిపారు. గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, వ్యవసాయం, వైద్యరంగం, ఔషధ తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను ఈ రంగమే అందిస్తోందన్నారు.
ఈ పరిశ్రమ ద్వారా దేశంలో 50 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, కోటికిమందికి పైగా పరోక్షం గానూ జీవనోపాధి లభిస్తోందని చెప్పారు. తెలంగాణలోనే ఈ రంగంపై ఆధారపడి సుమారు రెండు లక్షల మంది బతుకున్నారని వివరించారు. పాలిమర్ రంగం అభివృద్ధి చెందితే తయారీ రంగం విస్తరిస్తుందని, దాంతో ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన విజయాలను పాలిమర్ రంగంలోనూ పునరావృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, మెడికల్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్ టెక్నాలజీలు, పాలిమర్ కాంపౌండింగ్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ, ఈవీ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, బయో ఆధారిత పాలిమర్ల రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రదర్శనలో 550కు పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక తలను ప్రదర్శించనున్నారు. భారత్‌తో పాటు విదేశాల నుంచి 50,000కు పైగా వ్యాపార సందర్శకులు హాజరుకానున్నారు. గుజరాత్‌కు చెందిన సుమారు 160 కంపెనీలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన 110 ఎగ్జిబిటర్లు, చైనాకు చెందిన దాదాపు 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో టాప్మా అధ్యక్షులు నరేంద్ర బద్వా, హిప్లెక్స్ కన్వీనర్ మీలా జయదేవ్, ఏఐపీఎమ్ఏ ఉపాధ్యక్షులు వెన్నం అనిల్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



