రూ.452 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలు
విడుదల చేయండి
గిరిజన సంక్షేమానికి రూ.70 కోట్ల అదనపు నిధులు ఇవ్వండి :
కేంద్రమంత్రి జువాల్ ఓరాంకు
మంత్రి అడ్లూరి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా రూ. 452.05 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్ర జువాల్ ఓరాంను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. అలాగే గిరిజన సంక్షేమానికి రూ.70 కోట్ల అదనపు నిధులతో మరింత అండగా నిలవాలని, ప్రధాన్ మంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏఏజీవై) నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడిక్కడ జువాల్ ఓరాంను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిశారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించి 2024-25, 2025-26 బకాయిలతో పాటు 2026-27 ఏడాదికి గాను ప్రతిపాదనల మేరకు రూ.452.05 కోట్ల కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల వేలాది మంది గిరిజన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఆర్టికల్-275(1) కింద… 2024-25లో తెలంగాణకు రూ.98.37 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అయితే 2025-26లో రూ.35.26 కోట్లు, 2026-27లో రూ.32.10 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల గతంతో పోలిస్తే నిధులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా రూ.70 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గిరిజనులు అధికంగా నివసించే 428 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అమలవుతున్న పీఎంఏఏజీవై పథకం కింద మిగిలిన రూ.11.77 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారనీ, పెండింగ్ నిధుల్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి అడ్లూరి తెలిపారు. హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి రావాలని కేంద్రమంత్రిని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి… రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తానన్నారు. నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని, కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌లో జరిగిన ధర్నాకు మంత్రి సంఘీభావం తెలిపారు. ఎంపీలు మల్లు రవి, ఆర్. కృష్ణయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, సీఏపీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు జరిపోతుల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
నిధుల జాప్యంతో విద్యార్థులకు ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -



