తహసీల్దార్ కు తాడిచర్ల రైతుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామం కాపురం శివారులోని కరకల్ల రహదారిని ప్రభుత్వ పాత నక్ష (రెవెన్యూ మ్యాప్) ప్రకారంగా గుర్తించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ శుక్రవారం తాడిచర్ల గ్రామ రైతులు మండల తహసీల్దార్ కె. రవి కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు కరకల్ల రోడ్డు మార్గం కాలక్రమేణా పాత నక్ష ప్రకారం కనుమరుగైపోయిందని, సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు మొత్తం లోతైన గుంతలతో, పూర్తిగా బురదమయంగా మారిపోయిందని తెలిపారు.దీనివల్ల నిత్యం వందలాది మంది రైతులు, కూలీలు, పశువుల కాపరులు తమ పంట పొలాలకు వెళ్ళడానికి నరకయాతన అనుభవిస్తున్నారని, కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని వివరించారు.కావున రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, పాత నక్ష ప్రకారం ఈ రహదారి సరిహద్దులను సర్వే చేయించి గుర్తించాలని, బురద రోడ్డుకు మరమ్మతులు చేపట్టి రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తాడిచర్ల గ్రామ రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



