Sunday, August 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదల సంక్షేమాన్ని ఉచితాలుగా చిత్రీకరించడం సరికాదు

పేదల సంక్షేమాన్ని ఉచితాలుగా చిత్రీకరించడం సరికాదు

- Advertisement -

​సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ​
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు రూ.లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలు చేస్తున్న విషయాన్ని విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రజలకందించే రేషన్‌‌కార్డులు, పింఛన్లు, విద్య, వైద్యం, గృహ, ఉపాధి, రైతు సహాయం తదితర సంక్షేమ పథకాలు ఏమాత్రం “ఉచితాలు” కావని స్పష్టం చేశారు. పేదప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, సామాజిక అసమానతలను తగ్గించడానికి ప్రజాధనా న్ని వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. అనర్హులకు ప్రభుత్వాలు పథకాలు వర్తింపజేస్తున్నాయనే వ్యాఖ్యలో భాగంగా, ఉచిత పథకాల వల్ల ప్రజలు పనులకు వెళ్లడం లేదనీ, వ్యవసాయ కూలీలు అందుబాటులో లేరని చేసే వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించడమేనని తెలిపారు. కూలీలకు ఏడాది పొడవునా పని దొరుకుతుందా?, కనీస వేతనం అందుతోందా?, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఉన్నాయా ? అనే కనీస అంశాలను పరిశీలించకుండా సంక్షేమ పథకాలను తప్పుపట్టడం సరైందికాదని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కొరత, ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కాకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అందుతున్న కొద్దిపాటి సంక్షేమంపై ఆర్థిక భారం పేరుతో ప్రశ్నలు లేవనెత్తే ముందు సంపన్నులకు, కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న భారీ పన్ను రాయితీలు, ప్రభుత్వ భూముల కేటాయింపులు, ప్రాజెక్టుల్లో జరిగే దుబారా, అవినీతి వంటి అంశాలను కూడా పరిశీలించాలని హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి జాన్‌‌వెస్లీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -