ఎల్‌నినో ఎఫెక్ట్.. 21.5 లక్షల ఎకరాలపై అనిశ్చితి
వర్షాకాలంలోనూ డెడ్ స్టోరేజీలో నాగార్జునసాగర్ శ్రీశైలం నుంచి నీటి రాక మొదలైనప్పటికీ a వచ్చేది అనుమానమే..!
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఈ ఖరీఫ్‌లో వరి సాగు కష్టంగానే మారింది. దాదాపు 21.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాధారమైన సాగర్‌లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో వరి సాగుపై ప్రభుత్వం బ్రేక్ వేసింది. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని స్పష్టమైన సూచనలు జారీ చేసింది. దీంతో సాగర్ ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.
వతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోవ డం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తో నాగార్జునసాగర్ కమాండ్ ఏరియాలో ఈ ఏడాది వరి సాగు ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, కాలువల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. రైతులు వరి నాట్లు వేస్తే మధ్యలో నీరు అందక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది.
21.5 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 21.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కుడి కాలువ పరిధిలో 11.17 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ పరిధిలో 10.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల రైతులు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆగస్టు నెలలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల జరిగినా, ఈసారి ఎల్‌నినో ప్రభావం పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ప్రతి ఖరీఫ్‌లోనూ వరి ప్రధాన పంటగా ఉంటుంది.
ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచన
రైతులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వరి స్థానంలో కంది, పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రాజెక్టుల్లోని నీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షపాతం పరిస్థితులను రైతులకు వివరించి నష్టాలను నివారించేలా జిల్లా స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
శ్రీశైలం నుంచి ఊరట.. కాలువలకు హామీ లేదు
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం సుమారు 2.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 100 టీఎంసీల నీరు జలాశయంలోకి చేరింది. 216 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి ప్రస్తుతం 138 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో సుమారు 7,493 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నీటిమట్టం 513.50 అడుగులకు చేరి స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ ఈ నీరు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, దిగువ అవసరాల కోసమే వినియోగంలో ఉండటంతో కాలువలకు సాగునీరు విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదు.
వరి వద్దనడం సరికాదు
అఖిల భారత రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వరి సాగు చేయకుండా మెట్ట పంటలు వేసుకోవాలని మంత్రులు చేస్తున్న సూచనలు సరికాదు. ఆయకట్టు భూములు మెట్ట పంటలకు అంతగా అనుకూలంగా ఉండవు. రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని, పొలాలను సాగుకు సిద్ధం చేసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే బదులు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నికర జలాలు రాబట్టేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఆయకట్టు భూముల స్వభావాన్ని, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా మెట్ట పంటలు సాగు చేయాలని సూచించడం వల్ల రైతులకు మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయిలో భూముల స్వభావం, నీటి లభ్యత, రైతులు ఇప్పటికే చేసిన పెట్టుబడులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు కూడా అండగా నిలవాలి. వ్యవసాయ బోర్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి.



