ఆయన కంపెనీలు, సంస్థలపై దర్యాప్తు చేస్తాంవ్యూహరచనలోడెమొక్రాట్లు
వాషింగ్టన్ : త్వరలో జరిగే మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్‌పై పట్టు సాధించి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డెమొక్రాట్లు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉన్న కంపెనీలు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకొని కూలంకషంగా దర్యాప్తు జరిపేందుకు వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌లో మెజారిటీ వచ్చినా ట్రంప్‌ను అభిశంసించేందుకు వెంటనే ప్రయత్నించకూడదని, ముందుగా ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న కంపెనీలు, సంస్థలపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని వారు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రంప్ రాజకీయ, వ్యాపార వర్గాలతో సంబంధం ఉన్న సంస్థల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రతినిధులసభలోని సీనియర్ సభ్యులు, కమిటీ సహాయకులు ఇప్పటికే చర్చించారని తెలుస్తోంది.
ట్రంప్ ప్రభుత్వ అడుగులను నిశితంగా పరిశీలిస్తూ…
అధ్యక్షభవనంతో నేరుగా తలపడడం కంటే ప్రైవేటు కంపెనీలు, ఆర్థిక సంస్థలపై దర్యాప్తు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని డెమొక్రాట్లు అనుకుంటున్నారు. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తే డెమొక్రాట్లు అత్యంత జాగరూకతతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు తాము నేర్చుకున్న అనేక పాఠాలను కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో మెజారిటీ ఉంటే ట్రంప్‌ను అభిశంసించడం తేలికే అవుతుంది. అయితే ట్రంప్ తనను ఓ బాధితుడిగా చిత్రీకరించుకొని ప్రజల సానుభూతిని పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరిగిన తర్వాత… ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా గమనించాలని, అలాగే తన మిత్రులు, సన్నిహితులు, దాతలకు ప్రయోజనాలు చేకూర్చడానికి ఆయన తన అధికారాన్ని ఉపయోగించారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, అందుకోసం సభా దర్యాప్తు అధికారాలను ఉపయోగించుకోవాలని డెమొక్రాట్లు నిర్ణయించుకున్నారు.
మెజారిటీ వస్తే…
ట్రంప్‌ను అభిశంసించాలని, మొదటి రోజే ఓటమిని కొనితెచ్చుకోవాలని తాము అనుకోవడం లేదని ఓ డెమొక్రటిక్ సభ్యుడు వ్యాఖ్యానించారు. దర్యాప్తులు చేపట్టి వాటి ద్వారా ట్రంప్‌ను దోషిగా నిలబెట్టడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రస్తుతం రిపబ్లికన్లకు ప్రతినిధులసభలో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. మధ్యంతర ఎన్నికలలో డెమొక్రాట్లదే పైచేయి అవుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఆ మెజారిటీ ద్వారా అవసరమైన ఆధారాలు, పత్రాలను రాబట్టుకోవడానికి, బహిరంగ విచారణలు నిర్వహించడానికి, సమన్లు జారీ చేయడానికి డెమొక్రాట్లకు అధికారం లభిస్తుంది. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ వస్తున్న అభ్యర్థలను అధ్యక్షభవనం పట్టించుకోవడం లేదని, వాటిని వ్యతిరేకిస్తోందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కంపెనీలు, ఆర్థిక సంస్థలు, కాంట్రాక్టర్ల సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యమని వారు భావిస్తున్నారు.
ఇప్పుడు లేఖలు… తర్వాత సమన్లు
ఏయే విషయాలపై దర్యాప్తులు జరపాలన్న దానిపై డెమొక్రాట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. వివిధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, ఇతర సంస్థలకు పార్టీ నుంచి నాయకులు లేఖలు పంపుతున్నారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికలో డెమొక్రాట్లకు మెజారిటీ వస్తే అప్పుడు వారందరికీ సమన్లు పంపుతారు. ‘అధ్యక్షుడి కుమారుల జేబులు నింపే అనుమాన్పాద పెంటగాన్ కాంట్రాక్టులు, ట్రంప్ క్రిప్టో బిలియన్ల డాలర్లు, ట్రంప్ దాతల కోసం జరిగిన రహస్య ఒప్పందాలు…వీటన్నింటి పైన మేము ఆరా తీస్తాం. ప్రతినిధులసభలో మాకు మెజారిటీ వస్తే అవినీతిపై పోరాడతామని హామీ ఇస్తున్నాం’ అని పర్యవేక్షణ, న్యాయ కమిటీ సభ్యుడైన రాబర్ట్ గార్గ్ చెప్పారు. మీడియా సంస్థ పారామౌంట్ స్కైడాన్స్తో ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు, ప్రతిపాదిత వార్నర్ బ్రదర్స్ డిస్కవరి ఒప్పందం, వీడియో ప్లాట్ఫారం యూట్యూబ్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సంబంధించిన సమాచారం కోసం కూడా డెమొక్రాట్లు లేఖలు పంపారు.
కూపీ లాగేది వీరి నుంచే
యాపిల్, ఆల్ఫాబెట్, పలాంటిర్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్‌తో పాటు టెస్లా వంటి ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీల వ్యవహారాలు, వాటికి వచ్చిన కాంట్రాక్టులపై ఇప్పటికే డెమొక్రాట్లు ఆరా తీస్తున్నారు. అయితే ఏయే కంపెనీలను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా నిర్ణయించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కాంట్రాక్టులు, ట్రంప్ ప్రణాళికలో భాగమైన బాల్రూమ్ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, ట్రంప్‌కు ఆర్థికంగా మద్దతు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు వంటి వాటిపై కూడా డెమొక్రాట్లు చర్చించే అవకాశం ఉంది. అలాగే ట్రంప్‌తో సంబంధం ఉన్న ఆర్థిక సంస్థలపై దర్యాప్తు చేపట్టవచ్చు. వీటిలో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ భాగస్వామిగా ఉన్న వెంచర్ కాపిటల్ సంస్థ ‘1789 కాపిటల్’ కూడా ఉంది. ట్రంప్ కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థలలో పెట్టుబడులు పెట్టిన విదేశీ సార్వభౌమ సంపద నిధులపై కూడా కూపీ లాగుతారు. విదేశీ నిధుల వివరాలు రాబట్టడం కాంగ్రెస్‌కు అంత తేలికైన పని కాదు. కాబట్టి ట్రంప్ కుటుంబానికి, ఇతర మధ్యవర్తులకు సంబంధం ఉన్న అమెరికా సంస్థల నుంచి రికార్డులు పొందడంపై డెమొక్రాట్లు ఆలోచన చేస్తున్నారు.



