Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలోనూ ఉద్యోగులకు పాత పెన్షన్‌!

రాష్ట్రంలోనూ ఉద్యోగులకు పాత పెన్షన్‌!

- Advertisement -

సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి నిర్ణయం
టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ నేతలకు
టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌‌గౌడ్‌ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన తరహాలోనే తెలంగాణలోనూ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌బి మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌‌లో​ టీపీసీసీ అధ్యక్షులు మహే‌శ్‌కుమార్‌‌గౌడ్‌‌ను తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌‌లు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 2.6 లక్షల మందిని సామాజిక అభద్రతకు గురిచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్‌)‌ తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఓపీఎస్‌ను అమలు చేసిందని వివరించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 ఏండ్లుగా సీపీఎస్ వల్ల ఉద్యోగులు తీవ్ర సామాజిక భద్రతా లోపానికి గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రిటైర్మెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరికీ కనీస పెన్షన్ రూ.9,500 కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీ​పీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా ‌టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంతో చర్చిస్తా. త్వరలోనే ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం వచ్చేలా కృషి చేస్తా” అని స్పష్టమైన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌‌సీసీఎస్‌ఈయూ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా కో‌శాధికారి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -