Friday, August 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వం

ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వం

- Advertisement -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.నాగరాజు, రజనీకాంత్‌
కలెక్టరేట్ల ముట్టడిలో కదం తొక్కిన విద్యార్థులు

నవతెలంగాణ- విలేకరులు
‘‘ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.. నిధులు విడుదల చేయకపోతే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వం.. విద్యార్థులకు ఇవ్వడానికి నిధులు లేకుంటే.. ఇతర ప్రచార కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి’’ అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా గురువారం పెద్దఎత్తున విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ఏండ్ల తరబడి ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రయివేట్‌ విద్యాసంస్థలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ప్రచార కార్యక్రమాలు, భారీ మొత్తంలో ప్రకటనలు ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లోకి విద్యార్థులు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద అరెస్టులు
కరీంనగర్‌ కలెక్టరేట్‌ ముట్టడికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ముందుగా నగరంలోని తెలంగాణ చౌక్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు. పోలీసులు విద్యార్థి నాయకులను ఈడ్చుకెళ్లి సీపీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ సంక్షోభంలోకి నెట్టేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోవడంతో సర్టిఫికెట్ల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని, తక్షణమే ప్రత్యేక మంత్రిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు అందకపోవడం దారుణమన్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను వేలాది మంది విద్యార్థులు ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించి విద్యార్థులను లోనికి రానీయకుండా గేట్లు మూసేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌ ఆధ్వర్యంలో గేట్‌ ఎదుట బైటాయించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దాదాపు రెండు గంటలపాటు బైటాయించారు. జిల్లా జాయింట్‌ సెక్రెటరీ వేణుగోపాల్‌కి వినతి పత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌ హరిప్రియకు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘చలో కలెక్టరేట్‌’ ముట్టడి చేపట్టారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -