లోక్‌సభలో ఎటువంటి చర్చా లేకుండా 11 బిల్లులు
లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం ఉత్పాదకత
ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
మోడీ, షా వైఖరితో స్తంభించిన ఉభయ సభలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ 12 బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒక బిల్లుపై మాత్రమే ఉభయ సభలలో కూలంకషంగా చర్చ జరిగింది. నీట్ లీక్ తరువాత విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు ప్రవేశపెట్టిన ‘పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ (సవరణ) బిల్లు’పై లోక్‌సభలో 10 గంటల 54 నిమిషాలు, రాజ్యసభలో 6 గంటల 39 నిమిషాలు చర్చ జరిగింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ చర్చకు వచ్చిన ఏకైక బిల్లు ఇదే. ఈ బిల్లు మినహా, మరే ఇతర బిల్లుపైనా ఏ సభలోనూ కూలంకషంగా చర్చ జరగలేదు. లోక్‌సభ 11 బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించింది. ఈ బిల్లులలో తొమ్మిదింటిపై సంబంధిత మంత్రులు మాత్రమే మాట్లాడారు. కీలకమైన అంశాలపై వివరణలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దుస్సాహసానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉభయ సభలలో తీవ్రంగా నిరసన తెలుపుతుండగా… కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చ లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో నిమగ్నమైంది. ‘మ్యాగీ నూడుల్స్ తయారు చేసినంత సులభంగా’ కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదిస్తుందన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్ ఓ’బ్రియన్ విమర్శను వర్షాకాల సమావేశాల గణాంకాలు కూడా ధృవీకరిస్తున్నాయి. 1969 జనన, మరణాల నమోదు చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ముఖ్యమైన బిల్లుపై లోక్‌సభలో ఎలాంటి చర్చా జరగలేదు. మరోవైపు, రాజ్యసభలో కేవలం 50 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. ప్రతి ఎంపీకి కేటాయించిన సగటు సమయం మూడు నిమిషాలు మాత్రమే. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు (ఎఫ్‌సీఆర్ఏ)ను అధ్యయనం, నివేదిక కోసం సంయుక్త సభా సంఘాని (జేపీసీ)కి నివేదించారు.
వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ సామర్థ్యం 19 శాతంగా, రాజ్యసభ సామర్థ్యం 39 శాతంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అనవసరమైన ప్రతిపక్ష నిరసనలు ఉభయ సభల సామర్థ్యాన్ని దెబ్బతీశాయని కూడా మంత్రి ఆరోపించారు. అయితే, కీలకమైన అంశాలపై వివరణ ఇవ్వడానికి, చర్చలు జరపడానికి సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వం, వర్షాకాల సమావేశాలను నిరసనల సముద్రంలో ముంచివేసిందని ప్రతిపక్షాలు ఎత్తి చూపాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన నిరసనల కారణంగా వర్షాకాల సమావేశాలు పూర్తిగా రద్దయ్యాయి. లోక్‌సభ తనకు కేటాయించిన సమయంలో కేవలం 15 శాతం, రాజ్యసభ 18 శాతం మాత్రమే పనిచేశాయి. 2018 బడ్జెట్ సమావేశం, 2021 వర్షాకాల సమావేశం, 2023 బడ్జెట్ సమావేశాలు కూడా భారీ నిరసనలతో దెబ్బతిన్నాయి.
మోడీ, షా గైర్హాజరుతో స్తంభించిన పార్లమెంట్
ప్రతిపక్షాల ఐక్యతా రాగం.. తలకిందులైన కేంద్రం లెక్కలు
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి ఘటన గురించి స్పందించాలని ప్రతిపక్షాలు ఎంతగా పట్టుబట్టినప్పటికీ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు లెక్కచేయలేదు. దీంతో ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జులై 20న ప్రారంభమై గురువారం ముగిసిన ఈ సమావేశాల్లో… జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి సహా మరే అంశంపైనా చర్చ జరగలేదు. పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆసక్తి ఈ సమావేశాల్లో ఎంత మాత్రమూ కనిపించలేదు. సహజంగానే ఉభయ సభలలోని ప్రతిపక్ష పార్టీలు జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి విషయాన్ని లేవనెత్తాయి. అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలన్న సహేతుకమైన డిమాండ్‌ను మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ముందుకు తెచ్చాయి. కానీ మోడీ, షా ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గడానికి ఇష్టపడలేదు. జంతర్ మంతర్ వద్ద అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం బలపడటంతో, మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆ పదవి నుంచి తప్పంచాల్సి వచ్చింది. ఆర్ఎస్ఎస్‌కు కూడా విధేయుడైన ప్రధాన్ రాజీనామా, సంఘ్ పరివార్‌లో మోడీ-షా కూటమిపై విమర్శలకు దారితీసింది.



