నిర్మల్… ఈ పేరు వినగానే అందరి మదిలో మెదిలేవి కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులే కాదు కొయ్య బొమ్మలు కూడా. పొనికి కర్ర ఇక్కడి నకాషీ కళాకారుల చేతుల్లో పడి సరికొత్త రూపును సంతరించుకుని బొమ్మలుగా మారి జన ప్రియంగా తయారవుతున్నాయి. తెలంగాణ కళా వారసత్వానికి చిరస్మరణీయ గుర్తింపుగా నిలిచిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. నిమ్మనాయుడు కాలంలో నకాషీ కళాకారులు నిర్మల్‌కు వలస వచ్చి ఈ బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మలు జీవ కళను సంతరించుకోవడమే కాకుండా వారి ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో పొనికి కర్ర కొరతతో ఈ బొమ్మల తయారీకి అనేక అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించే ఈ బొమ్మలు నేడు కనుమరుగవుతున్నాయి. కళాకారులకు కూడా భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ కళ కనుమరుగైపోతుందేమో అనే ఆందోళన మొదలయింది. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకమైన నిర్మల్ చెక్క బొమ్మల తయారీ గురించి, వాటి విశిష్టత గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం…
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేసే బొమ్మలనే ‘నిర్మల్ బొమ్మలు’ అంటారు. ఈ బొమ్మలకు సుమారు 400 ఏండ్ల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. ఈ బొమ్మలను తయారు చేసేవారిని ‘నకాషీలు’ అంటారు. వీటిని పొనికి కొయ్య(కర్ర)తో తయారు చేస్తారు. కాబట్టే వీటికి ఆ అందం వస్తుంది.
నిర్మల్ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందిన వాడు. అప్పట్లో ఆయన దేశం నలుమూలల నుంచి నకాషీ కళాకారులను నిర్మల్‌కు రప్పించి హస్తకళలను అభివృద్ధి చేశారు. ఆయన హయాంలో నిర్మల్ పేరు ఖండాంతరాలు దాటింది. ఆయన అనంతరం పాలించిన రాజులు ఈ కుటుంబాలను ఆదుకుని నిర్మల్ కళలు అంతరించిపోకుండా అండగా నిలిచారు. నిర్మల్‌లో కొయ్య బొమ్మల పరిశ్రమ 17వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు భావిస్తారు.
జీవకళ ఉట్టిపడుతుంది
1830లో నిర్మల్ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ బొమ్మల గురించి చాలా గొప్పగా రాశారు. 1955లో అప్పటి ప్రభుత్వం నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బొమ్మల తయారీలో వనమూలికలు, సహజమైన రంగులు ఉపయోగిస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు ఉపయోగించి బంగారు రంగును తయారు చేస్తారు. పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకొని బొమ్మ ఆకారాన్ని మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు. ఆ తర్వాత బొమ్మను ఎండలో అరబెట్టి రంగులు వేస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు, సహజ వర్ణాలు ఉపయోగించి బంగారు వర్ణనాన్ని తయారు చేస్తారు. అందుకే వీటిలో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ బొమ్మలు మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్షపండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె తదితరమైనవి ప్రసిద్ధి పొందాయి. దీంతోపాటు ఇక్కడి కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నిర్మల్ కళాకారుల దేవతా చిత్రాలు ఎంతో పేరు పొందాయి.
పెయింటింగ్స్ కూడా..
కొయ్య బొమ్మలే కాదు.. నిర్మల్ పెయింటింగ్స్ కూడా ఎంతో జనాదరణ పొందాయి. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే గీతాబోధన, గంధర్వ కన్య, ప్రకృతి రమణీయత, దేవతల చిత్రాలు.. ఇలా ఎన్నో పెయింటింగ్స్‌కు కళాకారులు రూపకల్పన చేశారు. ఆ చిత్రాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. కళ్లను కట్టిపడేసే ఈ చిత్రాలను బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
నిజాం నవాబును ఆకర్షించిన నిర్మల్ బొమ్మలు
నిజాం నవాబు ఒకసారి నిర్మల్ పట్టణాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనకు సకల లాంఛనాలతో స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంపై కూర్చోగానే పై నుంచి పూలవర్షం కురిసింది. అవి మామూలు పూలు కావు. అచ్చంగా బంగారు పువ్వులను తలపించేలా నిర్మల్ కళాకారులు రూపొందించిన చెక్క పుష్పాలు. వాటిని చూసి నిజాం నవాబు ముచ్చటపడ్డాడని అందరూ అంటారు.
అమ్మకాలు
ఈ నిర్మల్ బొమ్మలు హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా అమెరికా, రష్యా, అరేబియా, మలేషియా, ఇరాన్, దుబారు, స్విట్జర్లాండ్, సింగపూర్, తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్.కామ్ తెలంగాణలోని ప్రముఖ ఉత్పత్తులను ఇక నుండి తమ ఆన్ లైన్ నుండి అమ్మేందుకు సిద్దమయింది.
జాతీయ అవార్డు
భారత కేంద్ర పర్యాటక శాఖ 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులో మన నిర్మల్ కొయ్య బొమ్మకు ప్రతిష్టాత్మక జాతీయ పర్యాటక అవార్డు దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం చేశారు. నిర్మల్ కొయ్యబొమ్మలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక సూచిక) లభించడంతో దీని ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
పొనికి వనాల పెంపు ఆలోచన…
కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్ తయారీలో ఉపయోగించే తేలికపాటి కలప పొనికి చెట్ల నుంచే వస్తుంది. దీంతో ఈ వనాలకు చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పొనికి చెట్లు కళాఖండాల తయారీకి అనువైన, మదువైన కలపను అందిస్తాయి. ఒకప్పుడు నిర్మల్ పరిసర అడవుల్లో విస్తారంగా కనిపించిన ఈ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. పొనిక చెక్క కొరత వల్ల కళాకారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య తీర్చేందుకు అధికారులు అటవీ స్థలాల్లో పొనికి ప్లాంటేషన్ పెంచాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వరుణ్ రెడ్డి, అభిలాష అభినవ్‌ల సహకారంతో పొనికి చెట్ల నుంచి టిష్యూకల్చర్ సాయంతో మొక్కలు పెంచారు. ఎంత ప్రయత్నించినా కేవలం వంద మొక్కలు మాత్రమే పెంచగలిగారు. అయితే పొనికి మొక్కలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయని అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో అక్కడి నుంచి ఐదు వేల మొక్కలను తెప్పించి మామడ మండలం లింగాపూర్, జగదాంబ తండాల్లో నాటించారు. ఈ వినూత్న కార్యక్రమానికి నాయకత్వం వహించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డ్ కూడా లభించింది.
సవాళ్లెన్నో…
తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు రాజులు, జమీందారుల ఆదరణతోపాటు దేశవ్యాప్తంగా డిమాండ్ పొందిన ఈ కళారూపాలు నేడు ఆధునిక మార్కెట్ పోటీ, తగ్గుతున్న కళాకారుల సంఖ్య, పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులతో మనుగడ కోసం పోరాడుతున్నాయి. నిర్మల్ కళాకతుల తయారీలో నైపుణ్యం కలిగిన సంప్రదాయ కళాకారుల కుటుంబాలు క్రమంగా ఇతర ఉపాధి మార్గాలవైపు మళ్లుతున్నారు. దీనికితోడు యువత ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. చేతితో తయారయ్యే ఈ కళాఖండాలకు సమయం ఎక్కువ పట్టడం, ఆదాయం తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
పోటీ తట్టుకోలేక
ప్లాస్టిక్, ఫైబర్, మెషిన్ తయారీ అలంకార వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో నిర్మల్ బొమ్మల మార్కెట్ దెబ్బతింటోంది. సహజంగానే చేతివత్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. దాంతో ధర కూడా ఎక్కువే ఉంటుంది. వీటితో పోల్చినపుడు మిషన్‌పై తయారు చేసిన ప్లాస్టిక్ వస్తువుల ధర చాలా తక్కువ. కానీ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెక్క బొమ్మలు ఎంతో మంచివి. ప్లాస్టిక్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పర్యావరణానికి కూడా అంత మంచిది కాదు. కనుక ప్రజలు చేతితో తయారు చేసిన చెక్క బొమ్మలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆ కళాకారులు కోరుకుంటున్నారు.
కళాకారులకు సదుపాయాలు ఏవీ?
నిర్మల్ బొమ్మలకు ఆదరణ పెంచేందుకు ప్రభుత్వం ఈ కళాకారులను ఆదుకుంటానని అనేక సార్లు హామీ ఇచ్చింది. కానీ అవేవీ నెరవేరలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చినా అవి వారికి దక్కలేదు. అయితే పొనికి వనాల పెంపకానికి ప్రోత్సాహం అందించడం, జీఐ ట్యాగ్ గుర్తింపు, పర్యాటక రంగంతో అనుసంధానం, కొత్త డిజైన్ల రూపకల్పన వంటి చర్యలు నిర్మల్ బొమ్మలకు కొంత వరకైనా కొత్త ఊపిరి పోసినట్టుగా భావించవచ్చు. అయితే కళాకారులకు సదుపాయాలు కల్పించకుండా కొత్త పథకాలు ఎన్ని వచ్చినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభుత్వం గుర్తించాలి. నిర్మల్ బొమ్మలకు డిమాండ్ ఉంది కానీ తయారు చేసే వాళ్లే తగ్గిపోతున్నారు. భవిష్యత్తులో ఈ కళ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గతంలో 60 నుండి 70 కుటుంబాలు సొసైటీ ఆధ్వర్యంలో బొమ్మలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు 20 కుటుంబాలు కూడా సరిగ్గా లేవు. అందుకే కళాకారులకు హెల్త్ కార్డులు, ప్రభుత్వ స్కీములు, ఉండటానికి ఇల్లు వంటివి ఏర్పాటు చేస్తే దీన్ని కూడా వృత్తిగా స్వీకరించాలనే ఆలోచన వస్తుంది. దీనివల్ల కొత్తతరం కూడా కళాకారులుగా తయారవుతారు.
ప్రభుత్వం చొరవ చూపాలి
నిర్మల్ అనగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్య బొమ్మలు దొరుకుతాయని అందరికీ తెలుసు. పేరు గొప్పగా ఉంది కానీ చేతివత్తిదారులకు సరైన సదుపాయాలు లేవు. ప్రభుత్వం దీనిపై కాస్త శ్రద్ధ పెట్టాలి. వందేండ్ల కిందట ఎవరి ఇండ్లల్లో వాళ్లు ఈ బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవాళ్లు. సొసైటీగా ఏర్పడిన కొత్తలో కళాకారులకు మంచి ప్రోత్సాహం లభించేది. ఇప్పటికీ ఆ సొసైటీ ఆధ్వర్యంలోనే బొమ్మలు తయారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది. పొనికి కర్ర కూడా ఎక్కడా దొరకడం లేదు. చెట్లన్నీ అంతరించి పోతున్నాయి. మొక్కలు నాటాలని మేము ఎప్పటి నుండే అడుగుతున్నాం. ఎన్నో ఏండ్ల నుండి అడుగుతుంటే ఈ మధ్యనే కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులు స్పందించి చెట్లను నాటించారు. కానీ అవి మాకు అందుబాటులోకి రావాలంటే కనీసం పది నుండి పదిహేనేండ్లు పడుతుంది. అప్పటి వరకు పొనిక కర్ర కొరతను ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందు నుండే చర్యలు తీసుకోవాలి. అలాగే సొసైటీకి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు. ఒకప్పుడు మేనేజింగ్ అసిస్టెన్సీ అని కొంతైనా శాంక్షన్ చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ప్రభుత్వం దీని కోసం కొంత ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుంది. అలాగే ఎగ్జిబిషన్లు పెడితే ప్రచారం పెరుగుతుంది. కానీ వాటిని భరించే స్తోమత మాకు లేదు. అదే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆన్‌లైన్ అమ్మకాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ వీటిని చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి. నిర్మల్‌లో దీనికి సరైన సదుపాయాలు కూడా లేవు. ప్యాకింగ్ కోసం కావల్సిన మెటీరియల్ మొత్తం హైదరాబాద్ నుండి తెచ్చుకోవాలి. దాంతో విపరీతమైన ఖర్చు అవుతుంది. అంత కష్టపడి ప్యాకింగ్ చేసి పంపించినా అవి చేరేసరికి ఏమైనా డ్యామేజ్ అయితే మరింత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆన్‌లైన్ అమ్మకాలు చేయలేకపోతున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలంటే ప్రభుత్వం చొరవ చూపాలి.
– బి.ఆర్.శంకర్, మేనేజర్, నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థ
భవిష్యత్తు అయితే లేదు
నాకు పదిహేనేండ్లు ఉన్నప్పుడు బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టాను. నేను నేర్చుకున్న కొత్తలో ఈ పని చేయడానికి చాలా మంది ఉండేవాళ్లు. ఈ కళ వంశపారంపర్యంగా వస్తున్న కళ. అందుకే దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మా తాతలు, తండ్రులు, మేము ఇలా చేస్తూనే ఉన్నాం. ఈపనిలో భవిష్యత్తు అయితే లేదు. ముడిసరుకు సమస్య చాలా ఉంది. అలాగే వర్కర్లకు బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. కేవలం ఈ కళపై ఆసక్తితో మాత్రమే చేస్తున్నాం. పెన్షన్ సౌకర్యం లేదు. అందుకే ఈ పని చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ట్రైనింగ్ స్కీంలు పెట్టాలి. అలాగే నేర్చుకున్న వాళ్లకు చెక్కను సప్లరు చేయాలి. అప్పుడే ఈ కళను కాపాడుకోగలం. లేదంటే కనుమరుగైపోతుంది. – పెంటయ్య
కళను కాపాడుకోవాలి
ఇక్కడ 30 ఏండ్ల నుండి పని చేస్తున్నాను. మా నాన్న దగ్గర నేను ఈ పని నేర్చుకున్నాను. ఈ బొమ్మలు తయారు చేసేటప్పుడు ఎంతసేపైనా కింద కూర్చొనే వుండాలి. రోజులో ఎనిమిది నుండి పది గంటలు కూర్చొనే వుండాలి. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తున్నాయి. మాకు అలవాటు ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. అదే ఈ తరం వాళ్లయితే అస్సలు చేయలేకపోతున్నారు. పీస్ రేట్ సిస్టమ్ ఉంటుంది. రోజుకు మహాయితే మూడు నుండి నాలుగు వందలు వస్తాయి. కళను కాపాడుకోవాలంటే ప్రభుత్వం మాకు సాయం చేయాలి. కర్ర కూడా కొరత ఉంది. ఈ కళ కొనసాగాలంటే ప్రభుత్వం సహకరించాలి.
– లక్ష్మీనారాయణ
– సలీమ
94900 99083



