Sunday, August 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకళ్యాణలక్ష్మి‌ రద్దుకు కాంగ్రెస్‌ కుట్ర

కళ్యాణలక్ష్మి‌ రద్దుకు కాంగ్రెస్‌ కుట్ర

- Advertisement -

ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు
రాజగోపాల్‌‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా
తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చిన రేవంత్‌ సర్కారు
కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతిపక్షాలు మాత్రమే చెప్పడం లేదనీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతిని బట్టబయలు చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హైకోర్టు తీర్పు మాటున కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను ఏఐసీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంగా మార్చిందని ఆరోపించారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోడీ సైతం రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో లేదా రాజకీయ వేదికలపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో ఈడీ దాడులు నిర్వహించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో, విచారణ ఎక్కడికి చేరిందో ప్రజలకు స్పష్టత లేదన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి రూ.ఐదు లక్షలు లేదా రూ.ఆరు లక్షల సాయం పొందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది నిబంధనలు, షరతులు విధిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వస్తున్నాయని అన్నారు. సామాన్యుడి అవసరాలను పట్టించుకోకుండా, అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా పాలన కాదన్నారు.

​కుటుంబం కోసమే పనిచేస్తున్న రేవంత్‌‌రెడ్డి
రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపదేపదే చెప్తున్నారనీ, ఆయన పనిచేస్తున్నది రాష్ట్రం కోసం కాదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బావమరుదులు, అల్లుడికి భూములు, కాంట్రాక్టులు, నిధులు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎనుముల తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులకుభూములు ఎలా సమకూర్చాలి, వారికి ఎలా సంపద దోచిపెట్టాలి, కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు ఎలా ప్రయోజనాలు కల్పించాలి అన్నదానిపైనే సీఎం దృష్టి ఉందన్నారు. ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో అవినీతి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, యువత హక్కులు వంటి అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను సమీక్షించుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, గతంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించాలనీ, అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, కుటుంబ ప్రయోజనాలకు పాలనను పరిమితం చేస్తే ప్రజలు తగిన సమయంలో సమాధానం చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు.

​ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైకోర్టు తీర్పు
కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి అంశంలో హైకోర్టు తీర్పు వెలువడిందని అన్నారు. లక్షలాది మంది ఆడబిడ్డల జీవితాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆ పథకంపై స్పందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం లేకుండా పోయిందా?అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్న కల్యాణలక్ష్మి పథకాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితికి తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలకు మంగళం
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్‌ను రద్దు చేశారనీ, కల్యాణలక్ష్మిని నిర్వీర్యం చేస్తున్నారని, షాదీ ముబారక్‌ను పక్కన పెట్టారని, రైతు బీమాను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమంగా మారిందన్నారు. నల్సార్‌ విద్యార్థుల ఆత్మగౌరవ పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులు, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల గొంతుకకు, వారి హక్కులకు, న్యాయం కోసం వారు చేసే పోరాటానికి తగిన గౌరవం ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో యువత ప్రశ్నించే హక్కును, ఆత్మగౌరవం కోసం నిలబడే హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్యార్థులు ప్రశ్నిస్తే వారిని అణచివేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నవారి బాధ్యత అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -