Wednesday, August 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిర్వాసితులే మొట్టమొదటి లబ్దిదారులు

నిర్వాసితులే మొట్టమొదటి లబ్దిదారులు

- Advertisement -

భూములు త్యాగం చేసిన రైతులకే తొలి ప్రయోజనం కల్పించాలి
సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
డిజైన్ల మార్పులు, అంచనాల సవరణలతో ఏండ్ల తరబడి జాప్యం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
ప్రాజెక్టులను సందర్శించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సీపీఐ(ఎం) బృందం

నవతెలంగాణ-అశ్వాపురం
గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం సమీపంలో చేపట్టిన సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులే మొట్టమొదటి లబ్దిదారులుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వెంటనే కేటాయించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సీపీఐ(ఎం) నాయకుల బృందంతో కలిసి సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను పోతినేని సుదర్శన్‌రావు సందర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించారు. అనంతరం ఆనకట్ట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​సీపీఐ(ఎం) ఆలోచనలోంచి పుట్టిన ప్రాజెక్టు
గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన సీపీఐ(ఎం) పోరాటాల నుంచే పుట్టిందని పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో గోదావరి జలాలను ఈ ప్రాంత రైతులకు సాగునీరుగా అందించాలనే డిమాండ్‌తో పాదయాత్రలు నిర్వహించామని గుర్తుచేశారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలుత రాజీవ్ సాగర్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ సాగర్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందిందన్నారు. ఆ సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7,940 కోట్లకు చేరిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 21 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదని విమర్శించారు.

​డిజైన్ల మార్పులతోనే కాలయాపన
ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం కొనసాగుతోందని పోతినేని విమర్శించారు. డిజైన్లు మార్పులు చేయడం, అంచనాలను పదేపదే సవరించడం తప్ప పనులు జరగడం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు అనేక పర్యాయాలు ప్రాజెక్టును సందర్శించడం తప్ప రైతుల ప్రయోజనాల కోసం వాస్తవంగా చేపట్టిన చర్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.

​14 కిలోమీటర్ల కాలువలతో ప్రయోజనం ఏది?
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు 14 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వి ఆర్భాటం చేశారని, అయితే అవేవి రైతులకు ఉపయోగపడేలా డిస్ట్రిబ్యూటరీ కాలువలను చేపట్టలేదని పోతినేని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని చెప్పడం మాత్రమే కాకుండా నీటిని చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లే పంపిణీ వ్యవస్థను కూడా పూర్తిచేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరేలా కాలువల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

​పూర్తయిన సీతారామ ప్రాజెక్టుతో వెంటనే నీళ్లివ్వాలి
ఇప్పటికే పూర్తిచేసిన సీతారామ సాగర్ ప్రాజెక్టు ద్వారా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువుతోపాటు నాగారం, మూకమామిడి తదితర ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందించాలని పోతినేని డిమాండ్ చేశారు. ఆయా చెరువులను గోదావరి జలాలతో నింపి రైతులకు యుద్ధ ప్రాతిపదికన సాగునీరు అందించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించాలని సూచించారు.

భూములు ఇచ్చిన నిర్వాసితులే …
సీతారామ సాగర్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులే ప్రాజెక్టు ద్వారా మొట్టమొదటి లబ్దిదారులయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోతినేని కోరారు. అశ్వాపురం మండలంలో ఎంతోమంది రైతులు రాజీవ్ సాగర్, సీతారామ సాగర్ ప్రాజెక్టుల కోసం తమ భూములను ధారాదత్తం చేశారని అన్నారు. భూములు త్యాగం చేసిన రైతులకే ముందుగా సాగునీటి ప్రయోజనం కల్పిస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి సార్థకత ఉంటుందని అన్నారు.

​పొగళ్లపల్లి లిఫ్ట్‌ను పూర్తి చేయాలి
దుమ్మగూడెం మండలంలోని పొగళ్లపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని పూర్తిచేస్తే సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చవచ్చని పోతినేని తెలిపారు. ఈ ప్రాంత రైతులకు గోదావరి జలాలను సాగునీరుగా అందించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో అనేకసార్లు సూచించినట్టు చెప్పారు. పొగళ్లపల్లి లిఫ్ట్‌ను పూర్తిచేయడం ద్వారా విస్తారమైన ఆయక ట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు.

​నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలి
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయించాలని పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. అంచనాల సవరణలు, డిజైన్ల మార్పులు, పనుల జాప్యంతో కాలయాపన చేయకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడి రైతుల ప్రయోజనాలను ప్రధానంగా తీసుకుని చర్యలు చేపట్టాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -