Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌తప్పు ఒప్పుకుని సరిదిద్దుతున్నాం

‌తప్పు ఒప్పుకుని సరిదిద్దుతున్నాం

- Advertisement -

24 గంటల్లో
 34 రిజిస్ట్రేషన్లు 
చేశాం
22ఏ నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందొద్దు
15 రోజులపాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన
ధరణి తప్పులకు హరీశ్‌‌రావు సమాధానం చెప్తారా?
 ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి : రెవెన్యూ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయబోద‌నీ. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోద‌నీ, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని చెప్పారు. తప్పును ఒప్పుకుని సరిదిద్దుతున్నామని వివరించారు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంద‌నీ, 24 గంట‌ల్లోనే మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో నాలుగు మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయ‌ని వివ‌రించారు.

​సాంకేతిక లోపంతో 22ఏ జాబితాలోకి
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని మంత్రి అన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పొరపాటును పారదర్శకంగా అంగీకరించి అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామ‌నీ, ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం త‌మ‌ది కాద‌ని స్పష్టం చేశారు.

వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించబడిన ప్రయివేట్ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందనీ, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని అన్నారు. 22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే 15 రోజులపాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి ఆస్తులన్నింటినీ తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విమర్శించడం చాలా సులువు
22ఏలో భూములు పెట్టి, వాటిని తొలగించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలపై పొంగులేటి ఘాటుగా స్పందించారు. “విమర్శలు చేయడం చాలా సులువు కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ విషయంలో పొరపాటు జరిగిందని మేము బహిరంగంగా అంగీకరించాం. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం.’అని పొంగులేటి అన్నారు. వారు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు.
పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయాలని సూచించారు. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం త‌మ ప్రభుత్వ విధానం కాదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న హరీశ్‌రావుకు 30 శాతం క‌మీషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసని చెప్పారు. కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీశ్‌రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా?అని ప్రశ్నించారు.

ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టాలి
బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. తనపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలనీ, ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజమని అన్నారు. వాటిని పట్టుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాద‌ని చెప్పారు. తాను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నాననీ, అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని వివరించారు. ఒక్కరోజులో రూ.వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదన్నారు. రబ్బర్ చెప్పులతో వచ్చి రూ.వేల కోట్లకు ఎదగలేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -