హక్కులతోపాటు విలువలూ ముఖ్యమే
శాసనమండలి ఎథిక్స్ కమిటీ భేటీలో
చైర్మెన్ మహేశ్ కుమార్‌గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
చట్టసభల్లోని ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మెన్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. హక్కులతోపాటు విలువలూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన మండలి ఎథిక్స్ కమిటీ 2026-27 సంవత్సరానికిగాను ప్రాథమిక సమావేశం మంగళవారం అసెంబ్లీ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్లో శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మెన్ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిప్యూటీ ఛైర్మెన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం, సమానత్వం వంటి విలువలను మరింత బలోపేతం చేయడమే ఎథిక్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి నైతిక విలువలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎక్కడ ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారనీ, రాజకీయాల్లో సద్విమర్శ అవసరమే కానీ విమర్శలు హద్దులు దాటకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు, నైతిక ప్రమాణాల పరిరక్షణకు కమిటీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు.ప్రజా సంక్షేమమే ప్రజా ప్రతినిధుల ప్రధాన ధ్యేయంగా ఉండాలనీ, శాసనసభ, శాసన మండలి సభ్యులు సమాజానికి ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సభ్యుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సభా చర్చల్లో భాషా వినియోగం విషయంలో కూడా సభ్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. నైతిక ప్రమాణాల అమలు, శాసన వ్యవస్థ గౌరవం, ప్రజల విశ్వాస పరిరక్షణ దిశగా ఎథిక్స్ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.ప్రివిలేజ్ కమిటీ సభ్యుల హక్కుల గురించి ఏ రకంగా కృషి చేస్తుందో అలాగే ఎథిక్స్ కమిటీ సభ్యుల విలువలను ప్రతిబించేలా పని చేసేందుకు ఎథిక్స్ కమిటీ కృషి చేస్తుందని అన్నారు. చట్ట సభలో ఉండే సభ్యుల పనితీరును ప్రజలు లోతుగా గమనిస్తారనీ, మనం హుందాగా విలువలను కాపాడుకుంటూ పని చేయాలని సూచించారు.
చట్టసభల్లో సభ్యులు హుందాగా వ్యవహరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



