నవతెలంగాణ – హైదరాబాద్
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కూడా స్థానిక కోటా ప్రయోజనం కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ క్యాడర్ అఖిల భారత సర్వీసు అధికారుల పిల్లలకు రాష్ట్రం వెలుపల చదివినా స్థానిక కోటా వర్తింపజేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ఆ అవకాశం నుంచి మినహాయించడం హేతుబద్ధమైన వర్గీకరణ కాదని పేర్కొంది. జీవో 150లోని నిబంధనలను వీలైనంత త్వరగా సవరించి కేంద్ర ఉద్యోగుల పిల్లలకు కూడా స్థానిక హోదా కల్పించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో జన్మించిన కె. సంహిత తండ్రి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌లో పనిచేస్తూ తిరుపతికి బదిలీ కావడం, అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో ఆమెకు స్థానిక కోటా వర్తించలేదు. దీనిని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల చదివిన అభ్యర్థులకు కొన్ని మినహాయింపులున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ క్యాడర్ అఖిల భారత సర్వీసు అధికారులు, రక్షణ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పిల్లలకు అలాంటి వెసులుబాటు ఉందని తెలిపింది. అదే ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు నిరాకరించడం సమంజసం కాదని పేర్కొంది. అడ్మిషన్ నిబంధనల్లోని రూల్ 3(ఎ)(3)ను సవరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా స్థానిక కోటాలోకి తీసుకువస్తామని అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ సవరణ పూర్తయ్యే వరకు సంహిత వంటి అభ్యర్థులు నష్టపోకుండా ప్రస్తుత ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్/బీడీఎస్ ప్రవేశాలకు సంహితను స్థానిక కోటా అభ్యర్థిగా పరిగణించి కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కాళోజీ యూనివర్సిటీని ఆదేశించింది.
పిరాయింపుల కేసు కొట్టేయండి హైకోర్టులో దానం లాయర్ వాదన
దానం నాగేందర్ బీఆర్‌ఎస్ సభ్యత్వం కొనసాగుతున్నదనీ, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆయన తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేవలం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా పార్టీ ఫిరాయింపును నిర్ధారించి అనర్హత విధించడం సాధ్యం కాదని వాదించారు.
దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి. ప్రకాశ్‌గౌడ్, ఎ. గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లను స్పీకర్ కొట్టివేశారు. ఆ నిర్ణయాలను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభాపక్ష నేత దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. దానం తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదిస్తూ.. 2024 మార్చి 15న ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను దానం కలిశారనీ, కాంగ్రెస్ కండువా ధరించారని పేర్కొంటూ కొన్ని పత్రికా కథనాలను సమర్పించారని తెలిపారు. అయితే కాంగ్రెస్‌లో చేరినట్లు దానం స్వచ్ఛందంగా ఎక్కడా ప్రకటించలేదన్నారు. వార్తా కథనాలు మాత్రమే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిర్ధారించేందుకు సరిపోవని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్‌లో లేని ఆరోపణలను అదనపు అఫిడవిట్ ద్వారా చేర్చడంలోని చట్టబద్ధతను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. దానం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదనీ, పార్టీ నుంచి బహిష్కరణకు గురైనట్టు, సస్పెన్షన్ చేసినట్టు సమాచారం కూడా లేదన్నారు. శాసనసభ బులెటిన్‌లో ఇప్పటికీ ఆయనను బీఆర్‌ఎస్ సభ్యుడిగానే చూపిస్తున్నారని తెలిపారు. దానం పార్టీ ఫిరాయించారని చెబుతున్న బీఆర్‌ఎస్ నుంచి స్పీకర్‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. చర్య తీసుకోవాలన్న అభ్యర్థన రాలేదని పేర్కొన్నారు. పార్టీ తరఫున అనర్హత పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు అధికారిక అనుమతి కూడా లేదన్నారు. అసెంబ్లీ వెలుపల వ్యక్తిగతంగా రాజకీయ నాయకులను కలవడం, ఇతర కార్యకలాపాలు నిర్వహించడం వంటివి అసెంబ్లీ కార్యకలాపాల పరిధిలోకి రావని వాదించారు. అనర్హతకు సంబంధించిన ప్రధాన అంశం మార్చి 15న పార్టీ ఫిరాయింపు జరిగిందా లేదా అన్నదేనని తెలిపారు. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సభ్యత్వ రుసుమును పార్టీ స్వీకరించిందనీ, లోక్‌సభ ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేయడంపై రాజ్యాంగంలో స్పష్టమైన అనర్హత నిబంధన లేదని వాదించారు. ఊహాజనిత అంశాల ఆధారంగా ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించలేరని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలకు మార్గం సుగమం
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతించింది. మార్చి 18న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సొసైటీ మేనేజ్‌మెంట్ కమిటీని ఆదేశించింది. గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించి ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మార్చి 18న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌పై ఏప్రిల్‌లో సింగిల్ జడ్జి స్టే విధించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సొసైటీ దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ సి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.
సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేసింది. 2024లో సభ్యత్వం పొందిన 270 మందికి ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. వారి ఓట్లను ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచాలనీ, తుది ఓటర్ల జాబితాలోని మిగిలిన సభ్యుల ఓట్లను కూడా విడిగా భద్రపరచాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను చట్టప్రకారం ప్రకటించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఫలితాల ప్రకటన అనంతరం ఎన్నికల పిటిషన్ ద్వారా సవాలు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహించిన 270 మంది నూతన సభ్యుల ఓట్లు ఫలితాలను ప్రభావితం చేస్తే ఆ అంశాన్ని కూడా ఎన్నికల పిటిషన్‌లోనే తేల్చుకోవాలని తెలిపింది. అదేవిధంగా 887 మంది సభ్యుల అనర్హతకు సంబంధించి అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పేర్కొంది. నూతన సభ్యత్వాలపై అభ్యంతరాలను కూడా సంబంధిత చట్టబద్ధ అధికారి ముందు సవాలు చేసుకునే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
కేంద్ర ఉద్యోగుల పిల్లలకూ స్థానిక కోటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



