సొంత పాఠశాల పదో తరగతి విద్యార్థులే నిందితులు
జల్సాల కోసం డబ్బు దోపిడీకి ప్లాన్
గుర్తిస్తుందనే భయంతో
కత్తితో దారుణ హత్య
రూ.1.54 లక్షలు, ఐఫోన్, కత్తి, గ్లౌజులు స్వాధీనం
70 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన
80 మందికి పైగా
అనుమానితుల విచారణ
కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి నగదు బహుమతులు
నవతెలంగాణ–నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
చక్కగా చదువుకుని భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన విద్యార్థులు జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి.. డబ్బు కోసం తాము చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌నే అంతమొందించారు. కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి దోపిడీకి ప్లాన్ వేసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు.
కేసు దర్యాప్తును మలుపుతిప్పిన మాట ‘బాబు’..
రూపారెడ్డి హత్యకు ముందు తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో పాఠశాల విద్యార్థి ఇంట్లోకి చోరబడటంతో చివరిగా ‘బాబు’ అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో.. ఆమె ఎవరిని ఉద్దేశించి ‘బాబు’ అన్నారనే కోణం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. పాఠశాలలో రూపారెడ్డి విద్యార్థులను సాధారణంగా ‘బాబు’ అని పిలుస్తారని గుర్తించి దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. హత్య అనంతరం పాఠశాలకు ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో విచారణ ఆలస్యమైంది. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఒక్కొక్కరిని విచారించగా, కొందరు విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, కొత్తగా జల్సాలకు అలవాటు పడటం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలు పోలీసుల దృష్టికి వచ్చాయి.
30 కిలోమీటర్ల పరిధిలో దర్యాప్తు
కేసును సవాలుగా తీసుకున్న ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాలతో దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్‌ప్రింట్స్, డాగ్‌స్క్వాడ్, సీసీ కెమెరాల ఫుటేజీ, టెక్నికల్ అనాలసిస్, పాత నేరస్థుల వివరాలు, అనుమానితుల కదలికలను పరిశీలించారు. ఘటనా స్థలం చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ఐదు ప్రత్యేక బృందాల్లో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేశారు. ఈ క్రమంలో 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాల్లో ఎరుపు రంగు హుడీ ధరించిన వ్యక్తి ఇంటి వెనుక నుంచి ప్రవేశించి, హత్య అనంతరం గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం వైపు పారిపోయిన దృశ్యాలు లభించాయి. ఈ దృశ్యాలను అనుమానిత విద్యార్థుల కదలికలతో సరిపోల్చడంతో కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. కేసులో లభించిన ప్రతి చిన్న ఆధారాన్నీ శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు.
వారం రోజులు రెక్కీ..
ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్టల్ గదిలో ఉంటున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికేవారు. గతంలో హాస్టల్‌లో డబ్బుల వ్యవహారంలో పట్టుబడిన సమయంలో రూపారెడ్డి వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. ప్రిన్సిపాల్ వద్ద స్కూల్ ఫీజుల డబ్బు ఉంటుందని భావించి దోపిడీకి పథకం వేశారు. సుమారు వారం రోజులపాటు ఆమె ఇంటి పరిసరాలను గమనించారు. ఆగస్టు 11న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకుని వచ్చారు. అనంతరం కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు.
రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఒకరు బయట ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తుండగా, మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. వంట గది ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు రూపారెడ్డి తమను గుర్తిస్తుందనే భయంతో ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 27 కత్తిపోట్లు చేశాడు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న నగదును తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి ఇద్దరూ పరారయ్యారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేశారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బట్టలు మార్చుకుని ఎరుపు రంగు హుడీని డ్రయినేజీలో పడేశారు.
జల్సాల కోసం డబ్బు
జల్సా జీవితం, బైక్, ఆల్కహాల్, గోవా ట్రిప్‌ల కోసం డబ్బు అవసరమై దోపిడీకి ప్లాన్ వేశారు. గతంలో ప్రిన్సిపాల్ మందలించిన ఘటన కూడా వారి మనసులో కక్షను పెంచింది.
బైక్‌పై వస్తుండగా అదుపులోకి..
దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో పోలీసులు ఇద్దరు విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. ఆగస్టు 19న ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లిపాకల ‘ఎక్స్’ రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులను దొనియాల ‘ఎక్స్’ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని సున్నితంగా విచారించి తనిఖీ చేయగా దుస్తుల్లో దాచిన సుమారు రూ.1.54 లక్షలు లభించింది. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా రూపారెడ్డి హత్య అనంతరం అపహరించినట్టు అంగీకరించారు. వారి నుంచి రూ.1.54 లక్షలు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందాలకు నగదు బహుమతులు
కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ ఎ.నవీన్‌కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్‌రెడ్డి, ఎస్ఐలు ఎ. రమేష్, ఎం. రామ్మూర్తి, డి. నరసింహులు, ఎన్. వెంకన్న, సీసీఎస్ ఎస్ఐ యు. సురేష్‌తోపాటు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం అనంతరం వారికి నగదు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.
వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



