‘ఎఫ్‌ఎల్‌ఎన్’ బలోపేతానికి ‘ఏక్‌స్టెప్’ ఫౌండేషన్ సాంకేతిక భాగస్వామ్యం
హైదరాబాద్‌లో మరో 450 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరణ
రెండు దశల్లో కలిపి 475 స్కూళ్లలో అమలు
రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో శిక్షణ
3, 4, 5 తరగతుల ‘టీచర్ సపోర్ట్ గ్రూప్’ (సి-గ్రేడ్) విద్యార్థులే లక్ష్యం
భాషా పటిష్టత, ప్రాథమిక గణితం పై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – సిటీబ్యూరో
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అత్యాధునిక కృత్రిమ మేధ(ఏఐ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రాథమిక విద్యలో అత్యంత కీలకమైన ‘ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ’(ఎఫ్‌ఎల్‌ఎన్) లక్ష్యాల సాధన దిశగా సరికొత్త సాంకేతిక బోధనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత విద్యాసంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని 25 ప్రాథమిక పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘ఏఐ బోధన’ అద్భుత సత్ఫలితాలనివ్వడంతో.. ఈ ఏడాది మరో 450 ప్రాథమిక పాఠశాలలకు విస్తరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 495 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 475 బడుల్లో ఈ విప్లవాత్మక డిజిటల్ లెర్నింగ్ అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
బేస్‌లైన్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
గత ఏడాది పైలట్ ప్రాజెక్ట్ కింద 25 పాఠశాలల్లో అమలు చేసిన ఈ ఏఐ ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థుల్లో అనూహ్య మార్పు కనిపించింది. జులై నెలలో నిర్వహించిన బేస్‌లైన్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థుల అభ్యసనా స్థాయి గణనీయంగా పెరిగినట్టు స్పష్టమైంది. పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్లపై భయం పోవడమే కాకుండా, సొంతంగా నేర్చుకునే ఆసక్తి, ఉత్సాహం పెరిగాయి. ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పదాల ఉచ్ఛారణ, సరళ వాక్యాల పఠనంతోపాటు గణితంలో కూడికలు, తీసివేతలను వేగంగా నేర్చుకోగలుగుతున్నారు.
‘టీచర్ సపోర్ట్ గ్రూప్’ విద్యార్థులపైనే ప్రధాన నజర్
తరగతి గదిలో చదువులో వెనుకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థులనే ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేస్తున్నారు. కనీస అభ్యసన ప్రమాణాలు లేని చివరి 10 మంది (సి-గ్రేడ్) విద్యార్థులను ‘టీచర్ సపోర్ట్ గ్రూప్’గా గుర్తిస్తారు. ఇలా ఒక్కో పాఠశాలలో 3, 4, 5 తరగతుల నుంచి దాదాపు 30 మంది విద్యార్థులు ఈ ఏఐ ల్యాబ్స్ ద్వారా శిక్షణ పొందుతారు. ఏఐ సాధన ద్వారా విద్యార్థి తన తరగతి స్థాయి కనీస సామర్థ్యాలను సాధించిన వెంటనే, వారిని సాధారణ తరగతికి పంపి.. వారి స్థానంలో మరో వెనుకబడిన విద్యార్థికి ఏఐ ద్వారా సాధన చేయిస్తారు.
ఏఐ బోధన ప్రక్రియ ఇలా..
పాఠశాల యూ-డైస్ కోడ్, విద్యార్థి వ్యక్తిగత ‘పెన్’ ఐడీతో సాఫ్ట్‌వేర్‌లో లాగిన్ అవుతారు. వారానికి 3 సెషన్లు, రోజుకు 20 నిమిషాల చొప్పున విద్యార్థి హెడ్‌సెట్ ధరించి కంప్యూటర్ ద్వారా సాధన చేస్తాడు. ఇది విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా ప్రశ్నల స్థాయిని మార్చుకుంటుంది. ఉదాహరణకు రెండంకెల గుణకారం చేయలేకపోతే వెంటనే సులభమైన సింగిల్ డిజిట్ ప్రశ్నలకు మారుతుంది. విద్యార్థి తప్పులను గుర్తించి సరైన పద్ధతిని స్క్రీన్‌పై వివరిస్తుంది. విద్యార్థి రోజువారీ పురోగతిని సాఫ్ట్‌వేర్ విశ్లేషిస్తూ టీచర్లకు, అధికారులకు ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్ రిపోర్టులను అందిస్తుంది.
‘ఏక్‌స్టెప్ ఫౌండేషన్’ భాగస్వామ్యం..
ఈ కార్యక్రమం కోసం విద్యాశాఖ ప్రముఖ ‘ఏక్‌స్టెప్ ఫౌండేషన్’తో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఈ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్న జిల్లాలోని నాంపల్లి మండలానికి చెందిన మోడల్ ఆలియా, మెహబూబియా, గన్‌ఫౌండ్రీ (గుంటారోడ్) తదితర పాఠశాలలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి విద్యాశాఖ కార్యదర్శి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి.
కంప్యూటర్లు, నెట్ సౌకర్యాల కల్పనపై కసరత్తు
తాజాగా ఎంపిక చేసిన 450 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రైమరీ, హైస్కూల్ ఒకే ప్రాంగణంలో ఉన్న చోట హైస్కూల్ కంప్యూటర్ ల్యాబ్‌లను వినియోగించుకుంటున్నారు. ఇతర పాఠశాలలకు అవసరమైన సిస్టమ్స్, కనీస ఇంటర్నెట్ సౌకర్యం, విద్యార్థులకు హెడ్‌సెట్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పాఠశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ‘ఫెసిలిటేటర్’గా నియమిస్తున్నారు. వారు మిగిలిన ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తూ విద్యార్థులు లాగిన్ అయ్యేలా చూస్తారు. అట్టడుగు స్థాయి విద్యార్థులను కూడా డిజిటల్ పరిజ్ఞానంతో తరగతి స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా విద్యాశాఖ చేపట్టిన ఈ సరికొత్త ‘ఏఐ’ ప్రయోగం ప్రాథమిక విద్యా ముఖచిత్రాన్ని మార్చనుందని హైదరాబాద్ డీఈవో ఎస్.యాదయ్య ధీమా వ్యక్తం చేశారు.
చిన్నారులకు ‘ఏఐ’ బోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



