నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలంలో అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామం, మదనపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దమ్మపేట మండలం పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ రోగుల వివరాలు, వైద్యులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.
రక్త పరీక్షల విభాగాన్ని పరిశీలించిన సందర్భంగా అనాలసిస్ యంత్రం పనిచేయకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. అది ఎప్పటి నుంచి పనిచేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించగా, సుమారు ఏడాది కాలంగా పనిచేయడం లేదని తెలిపారు. యంత్రం నిర్వహణ, మరమ్మతుల కోసం ఇప్పటికే దరఖాస్తు సమర్పించామని సిబ్బంది వివరించారు.
దీనిపై జిల్లా వైద్యాధికారిని ఫోన్లో సంప్రదించిన కలెక్టర్.. “మీ ఇంట్లో ఏదైనా పరికరం పనిచేయకపోతే ఇలాగే వదిలేస్తారా?” అని ప్రశ్నించారు. సుమారు రూ.3 లక్షల విలువైన వైద్య పరికరం ఏడాది కాలంగా పనిచేయకపోయినా దాని మరమ్మతులు, నిర్వహణకు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కీలకమైన పరికరాలు పనిచేయని పరిస్థితిలో ఉంటే వెంటనే స్పందించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వైద్య పరికరాల పనితీరును సమగ్రంగా పరిశీలించి, పనిచేయని పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలోని వైద్య పరికరాల నిర్వహణ బాధ్యతను సంబంధిత మెడికల్ అధికారి లేదా ప్రత్యేక అధికారికి అప్పగించాలని, అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
అనంతరం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మోడల్ సోలార్ గ్రామం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సోలార్ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెళ్లను పరిశీలించి, సోలార్ యూనిట్ల ఏర్పాటు, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో మొత్తం 424 మంది గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో స్లాబ్ ఉన్న 250 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు 242 ఇళ్లలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని వివరించారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను ఒక్కో ఇంటికి సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో యూనిట్ ద్వారా సుమారు 8 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, లబ్ధిదారులు తమ గృహ అవసరాలకు వినియోగించుకున్న అనంతరం మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసి యూనిట్‌కు రూ.2 చొప్పున చెల్లిస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్.. సోలార్ యూనిట్ల ద్వారా పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. గృహజ్యోతి పథకంతో పాటు సోలార్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. మిగిలిన ఇళ్లలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, గ్రామాన్ని ఆదర్శవంతమైన మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేసేలా పనులను సమన్వయంతో, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మదలపల్లి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.
డిజిటల్ క్లాస్‌రూమ్‌లో చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన పాఠశాలలో తరగతి గదులను సైతం పరిశుభ్రంగా ఉంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, ఇతర ప్రాంతాలను వెంటనే పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, తీసుకున్న చర్యలకు సంబంధించిన ఫోటోలను పంపించాలని ఆదేశించారు.
అనంతరం డైనింగ్ హాల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజనంపై వివరాలు తెలుసుకున్నారు. ఆ రోజు మెనూ ఏమిటని, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం కిచెన్‌ను పరిశీలించి భోజనం తయారీ, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. మెనూలో పేర్కొన్న కూర అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ వార్డెన్‌ను ప్రశ్నించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఎందుకు అందించడం లేదని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
డైనింగ్ హాల్లో డస్ట్‌బిన్ ఉన్నప్పటికీ దానిని సక్రమంగా నిర్వహించకపోవడంతో హాల్లో అపరిశుభ్రత నెలకొనడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు భోజనం చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన కనీస బాధ్యతను కూడా విస్మరించడంపై ప్రశ్నించారు. డైనింగ్ హాల్‌తో పాటు పాఠశాలలోని అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం కనిపించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, మెనూ అమలులో నిర్లక్ష్యం వహించినందుకు ప్రిన్సిపాల్, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదేవిధంగా పాఠశాలలో విద్యుత్ సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ అవసరమైన లైట్లు, ఇతర విద్యుత్ పరికరాలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు పరిశుభ్రమైన పరిసరాలు, నాణ్యమైన భోజనం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా పాఠశాల నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి అంశాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనల్లో జిల్లా కలెక్టర్ అంకిత్ వెంట శిక్షణ డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తహసీల్దార్ మురళి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



