పొలాలకు వెళ్లే దారులకు పట్టాలు ఇవ్వొద్దు
అసైన్డ్ భూముల హక్కులకు ప్రభుత్వ రక్షణ
ఆధార్ కార్డుల మాదిరిగానే
ఇక భూధార్ కార్డులు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నారాయణపురంలో రైతులతో మంత్రి ముఖాముఖి
పారదర్శకంగా జరుగుతున్న భూముల రీ-సర్వే
నవతెలంగాణ-సత్తుపల్లి
భూ భారతి చట్టం ద్వారా రాష్ట్రంలో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని నారాయణపురంలో గురువారం కడాస్ట్రల్ (భూమి హద్దులు), నాన్-కడాస్ట్రల్, భూ రీ-సర్వేపై రైతులతో నిర్వహించిన ముఖాముఖి, రైతు అవగాహనా సదస్సులో కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని పలువురు రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రైతుల సమ్మతితో సర్వే పారదర్శకంగా జరుగుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.అదే సమయంలో ప్రొహిబిటెడ్ లిస్ట్ (22ఏ) సమస్యలను పరిష్కరించాలని, వెనుక కుంట చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలని, కిష్టాపురం గ్రామంలోని అసైన్డ్ భూముల విస్తీర్ణం లెక్కల్లో ఉన్న తేడాలపై విచారణ జరిపించాలని మంత్రికి విన్నవించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మండల పరిధిలోని 12,047 ఎకరాల భూమిలో ఇప్పటికే 6,000 ఎకరాల రీ-సర్వే పూర్తయిందని, మిగిలిన భూ సర్వేను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. సర్వేలో ఏవైనా లోపాలు, అభ్యంతరాలు ఉంటే రైతులు అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చన్నారు. తప్పులను క్షేత్రస్థాయిలోనే సరిచేసి పారదర్శకతను ప్రకటిస్తున్నామన్నారు. వ్యవసాయ భూములకు వెళ్లే దారులను రైతుల వ్యక్తిగత భూముల్లో కలిపి పట్టాలు ఇవ్వకూడదని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్లను తప్పనిసరిగా పరిరక్షించాలన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలను అడ్డుకొని హద్దులు, కాంపౌండ్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు జలవనరుల పరిరక్షణే ప్రధాన అంశమని అన్నారు.
అసైన్డ్ భూముల హక్కులకు ప్రభుత్వ రక్షణ
అర్హులైన పేద రైతులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూముల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో సాగర్ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో గుర్తించిన 3,400 నకిలీ పాస్‌బుక్‌ల వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక సాంకేతికతతో మ్యాపింగ్ ప్రతి రైతు భూమికి కచ్చితమైన కోఆర్డినేట్లు, జీపీఎస్ ఆధారిత డిజిటల్ మ్యాప్‌లు రూపొందించి భద్రపరుస్తామన్నారు. రీ-సర్వే పూర్తయ్యాక వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి, 30 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాతే తుది టైటిల్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఆధార్ కార్డుల మాదిరిగానే రైతుల భూములకు ప్రామాణికమైన భూధార్ కార్డులను అందజేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. వచ్చే 18 నెలల్లో వ్యవసాయ భూములు, ఆబాదీ ఆస్తుల రీ-సర్వే పూర్తి చేస్తామన్నారు. అమాయకులను ముందుపెట్టి 22ఏ (ప్రొహిబిటెడ్) భూములను అక్రమంగా క్రమబద్దీకరించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వైసీపీ వసుంధర యాదవ్ ఫారెబి, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మెన్ దోమ ఆనంద్ బాబు, ప్రజాప్రతినిధులు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



