Friday, August 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపంట రుణాలు ఇవ్వట్లే

పంట రుణాలు ఇవ్వట్లే

- Advertisement -

రైతులపట్ల బ్యాంకర్ల చిన్నచూపు..అంకెల గారడీతో సర్కారును బురిడీ కొట్టిస్తున్న వైనం
ఘనంగా ప్రభుత్వ రుణ ప్రణాళికలు లక్ష్యాలకు ఆమడదూరంలో వాస్తవాలు

బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ రుణ ప్రణాళికకు, బ్యాంకర్ల నిర్ణయాలకు మధ్య జమీన్‌ ఆస్మాన్‌ ‌ఫరక్‌ ‌కనిపిస్తోంది. పంట రుణాలే కాదు…వ్యవసాయ అనుబంధ రంగాలకూ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ప్రభుత్వ రుణ ప్రణాళికను ఎంతవరకు సమర్థవంతంగా అమలు చేశామనే లక్ష్యంగా కాకుండా, గత ఏడాది ఇదే సమయానికి ఇచ్చిన రుణాలకంటే కేవలం ఒకటి లేదా రెండుశాతం ఎక్కువ ఇచ్చినట్టు చూపిస్తే చాలన్నట్టు బ్యాంకర్ల లెక్కలు ఉంటున్నాయి.

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్ర్తి
2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ ప్రణాళికలో మొత్తం వ్యవసాయ రంగానికి రూ.1,81,035 కోట్ల రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ గడచిన జూన్‌ ‌మాసాంతం వరకు ఇచ్చిన రుణాలు కేవలం రూ.52,097 కోట్లు (28.91 శాతం). వాటిలో ప్రస్తుత ఖరీఫ్‌ (జూన్‌ ‌నుంచి ఆక్టోబర్‌ ‌వరకు) స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యం ‌రూ.58,152 కోట్లు కాగా, ఇచ్చిన రుణాల మొత్తం రూ.20,069 కోట్లు (34.51 శాతం) మాత్రమే. వ్యవసాయ టెర్మ్‌ ‌రుణాల లక్ష్యం రూ.57,192 కోట్లు కాగా, ఇచ్చిన రుణాలు కేవలం రూ.16,335 (28.56 శాతం) మాత్రమే. వ్యవసాయ మౌలిక సదుపాయాల రుణ లక్ష్యం రూ.7,797 కోట్లు కాగా, ఇచ్చిన రుణ మొత్తం కేవలం రూ.835 కోట్లు (10.72 శాతం) మాత్రమే. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం ఇచ్చే రుణాల లక్ష్యం రూ.19,126 కోట్లు కాగా, ఇచ్చిన రుణ మొత్తం రూ.15,097 కోట్లు (78.93 శాతం)గా ఉంది. కానీ దీనిలో కూడా డెయిరీల ఏర్పాటు కోసం రూ.10,435.51 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఇచ్చింది రూ.2,682.86 కోట్లు (25.71 శాతం).

పౌల్ట్రీ పరిశ్రమకు రుణ లక్ష్యం రూ.7,077.82 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.429.85 కోట్లు (6.07 శాతం). మత్స్య పరిశ్రమ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీనికి రుణ లక్ష్యం రూ.2,218.52 కోట్లు కాగా, ఇచ్చిన మొత్తం రూ.18.26 కోట్లు (0.82 శాతం) మాత్రమే. ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి బ్యాంకర్ల చేయూత పూర్తిస్థాయిలో లభించట్లేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రికవరీకి సులభంగా ఉండే వాటికే రుణాలు ఇస్తున్నారు. కానీ వ్యవసాయ రుణ ప్రణాళికలో ఆ రంగం మొత్తాన్ని కలిపి లెక్కించడంతో ఎక్కువ శాతం రుణాలు ఇచ్చినట్టు కనిపి స్తున్నాయి. కానీ విభాగాలవారీ రుణ వర్గీకరణ చేస్తే అసలు వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఇక వ్యవసాయ క్లినిక్స్‌, అగ్రి బిజినెస్‌ ‌సెంటర్ల రుణ ప్రణాళికలో 298 దరఖాస్తులు రాగా, రిఫర్‌ ‌చేసిన అప్లికేషన్లు కేవలం 18 మాత్రమే. పై దరఖాస్తుల కోసం రూ.31.02 కోట్లు ఆమోదించి, రిఫర్‌ ‌చేసిన మొత్తం మాత్రం 0.82 కోట్లు మాత్రమే.

ఎన్‌‌పీఏలు…
వ్యవసాయరంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌‌పీఏ) పెరుగుతు న్నాయని బ్యాంకర్లు చెప్తున్నారు. మొత్తం వ్యవసాయరంగంలో బకాయిలు రూ.1,92,466.05 కోట్లు ఉండగా, వాటిలో రూ.9,085.74 కోట్లు ఎన్‌‌పీఏలుగా మారాయి. వీటిలో భాగమైన స్వల్పకాలిక పంట రుణాల్లో రూ.88,533 కోట్ల బకాయిలు ఉండగా, వాటిలో 4,217.20 కోట్లు (4.76 శాతం) ఎన్‌‌పీఏగా మారాయని బ్యాంకర్లు చెప్తున్నారు. గడచిన త్రైమాసికంలో వ్యవసాయ రంగ ఎన్‌‌పీఏలు 4.71 శాతం ఉండగా, ప్రస్తుత త్రైమాసికంలో అవి 4.72 శాతానికి పెరిగాయి.

అంకెల గారడీ
లక్ష్యాల ఎంపిక, పురోగతిలో బ్యాంకర్లు అనుసరిస్తున్న గణాంకాల గారడీ గమ్మత్తుగా మారింది. ప్రజావసరాల కంటే అంకెల మాయాజాలంపైనే ఆర్థిక సంస్థలు ఆధారపడుతున్నాయనిపిస్తోంది. ఉదాహరణకు గత ఏడాది ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో 32.73 శాతం లక్ష్యాలను సాధిస్తే, ప్రస్తుత ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో అది 34.51 శాతంగా ఉంది. అంటే గత ఖరీఫ్‌ ‌సీజన్‌‌కంటే 1.78 శాతం వృద్ధి నమోదైనట్టు అంకెల్లో చూపుతున్నారు. అలాగే వ్యవసాయ టర్మ్‌‌లోన్‌ ‌విషయంలోనూ గత ఏడాది ఇదే సీజన్‌‌లో లక్ష్యసాధన 21.43 శాతం ఉండగా, ప్రస్తుత ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో 28.56 శాతం లక్ష్యాన్ని నమోదుచేసినట్టు రికార్డుల్లో చూపారు. అంటే ఇక్కడ 7.13 శాతం వృద్ధి నమోదైంది. అసలు మొత్తం వ్యవసాయరంగంలో గత ఏడాది ఇదే సీజన్‌‌లో 24.83 శాతం లక్ష్యాలను సాధిస్తే, ఇప్పుడు 28.91 శాతం లక్ష్యసాధన నమోదైంది. అంటే గత సీజన్‌‌కంటే 4.08 శాతం వృద్ధిని రికార్డుల్లో చూపుతున్నారు. మరింత సులభంగా అర్థం కావాలంటే ఉదాహరణకు …ఓ స్కూల్‌‌లో వందశాతం విద్యార్థులు విజయం సాధించారని ఘనంగా ప్రకటించారు. అసలు ఆ స్కూల్‌‌లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారని ఆరాతీస్తే ఒకే విద్యార్థి ఉన్నాడని తెలుస్తుంది. అంటే లెక్క కరెక్టే…ఉన్నది ఒక్కడే కాబట్టి వందశాతం అయ్యింది. ఇప్పుడు బ్యాంకర్ల లెక్కలు కూడా ఇలాగే ఉన్నాయని ఆర్థికరంగ విశ్లేషకులు చెప్తున్నారు.

వ్యవసాయంపై ప్రభావం
బ్యాంకులు రైతాంగానికి సకాలంలో ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంతో దళారుల వడ్డీ దందాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా కౌలు రైతుల కష్టాలు మరింత కఠినంగా ఉన్నాయి. వారికి బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వట్లేదు. దీనితో తప్పనిసరై వారు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించడంలో బ్యాంకర్లు చాలా వెనుకబడి ఉన్నారని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రుణమాఫీల కంటే పంట నష్టం బీమా ప్రయోజనాలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతాంగానికి ఆర్థిక భరోసా పెరుగుతుందని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -