నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్ హామీలు
అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యో భృతి, యూత్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నదనీ, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించ డంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట జరిగిన ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసిన నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని మోడీ సర్కార్‌ను ప్రశ్నించారు.
పన్నెండేండ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలుంటే కేవలం 7 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడం సరిగాదని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించడంలోనూ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనీ, ఎలాంటి కోర్టు కేసులు లేకుండా వివాదాస్పద జీవోలను తొలగించి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలనీ, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, నిరుద్యో భృతి వంటి హామీలను నెరవేర్చాలనీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.



