Friday, August 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు22ఏ దుర్వినియోగం

22ఏ దుర్వినియోగం

- Advertisement -

రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి
మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి
రాహుల్‌‌గాంధీకి హరీశ్‌‌రావు బహిరంగలేఖ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో సెక్షన్ 22ఏ దుర్వినియోగం అవుతున్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతున్నదని తెలిపారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి గురువారం హరీశ్‌రావు బహిరంగ లేఖ ‌రాశారు. సెక్షన్ 22ఏ అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని తెలిపారు. ప్రయివేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రయివేటు ఆస్తులను ఏకపక్షంగా 22ఏ జాబితాలో పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22ఏలో పెట్టారంటూ నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ప్రయివేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

​హైకోర్టు రిటైర్డ్‌ ‌జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలి
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా హైకోర్టు రిటైర్డ్‌ ‌జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఈ 30 శాతం కమీషన్లు, 50:50 అగ్రిమెంట్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు? విచారణలో నిగ్గు తేల్చాలని కోరారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరి జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు? మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు తేల్చాలని తెలిపారు. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌‌సీ) కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్లీ 22ఏలో పెట్టి స్తంభింపజేయడం దుర్మార్గమని విమర్శించారు.

​జిల్లాల వారీగా నిషేధిత జాబితాను ప్రజల ముందుంచాలి
జిల్లాల వారీగా 22ఏలోని నిషేధిత భూముల జాబితాను ప్రజల ముందు ఉంచాలని హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశంతో తీసేశారో ప్రజలకు పారదర్శకంగా తెలియాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన భూమాత, భూ రికార్డులకు స్పష్టతనివ్వాలని తెలిపారు. కానీ ప్రజల ఇండ్లను లాక్కునే రాబందులా మారకూడదని పేర్కొ న్నారు. అవినీతి మంత్రిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతోందని విమర్శించారు. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -