జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
సంస్థను వెంటనే రద్దు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్టగొట్టే రాంకీ సంస్థను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాంకీ సంస్థను రద్దు చేయాలంటూ గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులతో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి జి.రాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు వేల మందికిపైగా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు అనేక ఏండ్లుగా ఇంటింటికీ చెత్త సేకరిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. షాపింగ్ మాల్స్, పెద్ద హోటళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి కూడా చెత్త సేకరిస్తున్నప్పటికీ వారికి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయివేటు రాంకీ సంస్థ పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి చెత్తను తమకే ఇవ్వాలని నోటీసులు జారీ చేసి సేకరిస్తోందని తెలిపారు. దీంతో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థను కొనసాగిస్తే వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు.
రాంకీ సంస్థను రద్దు చేసి షాపింగ్ మాల్స్, హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో చెత్త సేకరించే అవకాశం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త ఆటోలు ఇచ్చిన సమయంలో డీజిల్ ఖర్చులతోపాటు మెయింటెనెన్స్ చార్జీలు, కార్మికులకు గ్లౌజులు, షూస్, సబ్బులు, నూనెలు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఆటోలు రిపేర్లకు వస్తే ఒక్కోసారి రూ.5 వేల నుంచి రూ.60 వేల వరకు మెకానిక్ ఖర్చులు భరించాల్సి వస్తోందని తెలిపారు. రోజూ ఇంటింటికీ చెత్త సేకరించడం వల్ల కార్మికులు వివిధ అనారోగ్య సమస్యలు, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారమూ లేకుండా ఇంటింటికీ చెత్త సేకరిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులను జీహెచ్‌ఎంసీ కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాంకీ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక కుటుంబాలతో కలిసి జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జీహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రాహుల్ దేవ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం.దశరథ్, నగర నాయకులు ఎం.మహేందర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు సి.మల్లేష్, స్వచ్ఛ ఆటో కార్మికులు నల్లపోతుల కృష్ణకళ్యాణ్, నల్లబోతు మహేష్, మాండ్ల గిరి, నల్లబతుల మహేష్, మాండ్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



