రాబడి రూ.59,642 కోట్లు, వ్యయం రూ.78,909 కోట్లు
జులై నాటికే ద్రవ్యలోటు రూ.33,730 కోట్లు
రెవెన్యూ లోటు రూ.19,267 కోట్లు
పెన్షన్లకే రూ.10,492 కోట్ల వ్యయం
అప్పులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం
గ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్ష
కాగ్ జులై నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందనీ, రూ.2,34,405.83 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.59,642.62 (24.72 శాతం) కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. రూ.78,909.45 (33.66 శాతం) కోట్లు ఖర్చు చేసింది. అంటే ఆదాయం కన్నా రూ.19,266.83 కోట్ల ఖర్చు అదనం కావడం గమనార్హం. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. ఇంకోవైపు జులై నాటికే రూ.33,729.98 కోట్ల ద్రవ్యలోటు నమోదైంది. రెవెన్యూ లోటు రూ.19,266.83 కోట్లు ఉన్నది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 29.22 శాతం మేర ఉన్నప్పటికీ, వడ్డీలు, పెన్షన్లు, జీతాలు, సబ్సిడీలకు చెల్లించే వ్యయం గణనీయంగా పెరుగుతున్నది. మూలధన వ్యయానికి కేటాయించిన నిధుల వినియోగం మాత్రం 19.62 శాతానికే పరిమితమైంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జులై నాటికి సంబంధించిన ఆర్థిక గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది.
పన్నుల ఆదాయం రూ.59,642 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.2,41,263.59 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.59,642.62 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాలో 24.72 శాతం వచ్చింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 21.86 శాతం ఆదాయం రావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ రాబడులు పెరిగాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మెరుగుపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రూ.1,81,367.39 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.53,004.40 కోట్లు వచ్చాయి. ఇది వార్షిక బడ్జెట్ అంచనాల్లో 29.22 శాతం. గతేడాది ఇదే కాలంలో 27.46 శాతం రావడం గమనార్హం.
పెరుగుతున్న పన్నుల ఆదాయం
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం మెరుగుపడింది. జీఎస్టీ ద్వారా రూ.61,564.92 కోట్లు వస్తాయని అంచనా వేస్తే జులై నాటికి రూ.19,103.55 (31.03 శాతం) కోట్లు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19,540.54 కోట్లు వస్తాయని అంచనా వేసింది. జులై నాటికి రూ.6,144.95 (31.45 శాతం) కోట్ల నిధులొచ్చాయి. అమ్మకపు పన్ను ద్వారా రూ.38,105.55 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వానికి రూ.12,584.59 (33.03 శాతం) కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ద్వారా రూ.27,668.48 కోట్లు వస్తాయని అంచనా వేస్తే రూ.6,965.88 (25.18 శాతం) కోట్లు వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.24,106.72 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,502.15 (22.82 శాతం) కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను వంటి రంగాల నుంచి వచ్చే ఆదాయం ఆశాజనకంగా కనిపిస్తున్నది.
పన్నేతర ఆదాయం పెరుగుతున్నా
పన్నేతర ఆదాయం కింద రూ.35,730.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది. జులై నాటికి రూ.4,274.55 (11.96 శాతం) కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే కాలంలో కేవలం 4.22 శాతం మాత్రమే రావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్నేతర ఆదాయంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తున్నది.
కేంద్రం ఆర్థిక సహకారం అంతంతే…
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,166 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.2,363.67 (9.78 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అంతంత మాత్రంగానే ఉందని ఈ గణాంకాలను బట్టి అర్థమ వుతున్నది. తెలంగాణ పట్ల వివక్షను కనబరుస్తున్నదని తెలుస్తున్నది.
అప్పులపై ఆందోళన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడులు రూ.59,945.53 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.33,745.43 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పుల ద్వారానే రూ.33,729.98 కోట్లు రావడం గమనార్హం. అడ్వాన్సులు, రికవరీల ద్వారా కేవలం రూ.15.45 ఓట్లు వచ్చాయి. అంటే రాష్ట్ర ఖజానాకు వచ్చిన మూలధన రాబడుల్లో దాదాపు మొత్తం అప్పుల ద్వారానే సమకూరిందని ఈ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. దీంతో అభివృద్ధి వ్యయానికి, ఇతర ఆర్థిక అవసరాలకు అప్పులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి కొనసాగుతున్నది.
జులై నాటికి రాష్ట్ర ద్రవ్యలోటు రూ.33,729.98 కోట్లుగా నమోదైంది. ఇది బడ్జెట్‌లో అంచనా వేసిన ద్రవ్యలోటులో 57.70 శాతం కావడం గమనార్హం. అదే సమయంలో ప్రాథమిక లోటు రూ.23,197.62 కోట్లుగా ఉన్నది. వడ్డీ చెల్లింపులను పక్కన పెట్టి చూసినా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో లోటు కొనసాగుతున్నది.
రాష్ట్ర అభివృద్ధికి నిధులేవి?
రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.47,267.28 కోట్లు కేటాయించారు. జులై నాటికి రూ.9,272.65 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. అంటే 19.62 శాతం నిధులనే ప్రభుత్వం ఖర్చు చేసింది. రెవెన్యూ ఖర్చులు 33.66 శాతానికి చేరినా మూలధన వ్యయం మాత్రం 19.62 శాతానికే పరిమితం కావడం గమనార్హం. అంటే అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేయడం లేదని తెలుస్తున్నది. అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల వంటి వాటికి తప్పనిసరిగా ఖర్చు చేయాలి. ఆ తర్వాత మిగిలితేనే అభివృద్ధి, మౌలిక వసతుల కోసం నిధులను ఖర్చు చేసే పరిస్థితి ఉన్నది. అందుకే అభివృద్ధి పనులకు నిధులు అంతంత మాత్రంగానే ఖర్చవుతున్నాయి.
పెరుగుతున్న రెవెన్యూ ఖర్చు
రెవెన్యూ ఖర్చు పెరుగుతున్నది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులు రూ.21,304.39 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.10,532.36 కోట్లు ఖర్చు చేసింది. అంటే నాలుగు నెలల్లోనే 49.44 శాతం ఖర్చు కావడం గమనార్హం. జీతాలు, వేతనాలకు సంబంధించి రూ.48,358.21 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. జులై నాటికి రూ.17,874.35 (36.96 శాతం) కోట్లు ఖర్చయ్యాయి. పెన్షన్లకు సంబంధించి రూ.14,736.56 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికే రూ.10,492.35 కోట్లు ఖర్చు చేసింది. నాలుగు నెలల్లోనే 71.20 శాతం నిధులు ఖర్చు కావడం గమనార్హం. సబ్సిడీలకు రూ.18,105.16 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు రూ.7,870.31 (43.47 శాతం) కోట్లు ఖర్చయ్యాయి. పెన్షన్లకు సంబంధించిన వ్యయం బడ్జెట్ అంచనాలో 71 శాతానికిపైగా ఉండడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడిని సూచిస్తున్నది.
రెవెన్యూ లోటు పెద్ద సవాలు
రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ రాబడులు రూ.59,642.62 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.78,909.45 కోట్లుగా ఉన్నది. దీంతో రూ.19,266.83 కోట్ల రెవెన్యూ లోటు నమోదు కావడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉన్నది. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మరింత పెంచి, రెవెన్యూ వ్యయం–రాబడుల మధ్య అంతరాన్ని తగ్గించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అప్పులపై ఆధారపడటాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. రెవెన్యూ వ్యయాలు పెరిగే కొద్దీ మూలధన ఖర్చుకు నిధులు కేటాయించి ఖర్చు చేయడం సవాలుగా మారుతుంది. మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరముందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.



