నవతెలంగాణ – హైదరాబాద్ : జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అర్హత విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాదిగా కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను సడలించిన ధర్మాసనం, ఇకపై ఏడాది పాటు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏజీ మసీహ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం 2:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అయితే, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ తీర్పుతో విభేదించారు.
గతంలో 2025 మే నెలలో ఇచ్చిన తీర్పు ప్రకారం, జడ్జి పరీక్ష రాయాలంటే లా గ్రాడ్యుయేట్లకు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ ఉండటం తప్పనిసరి. తాజా తీర్పుతో ఈ నిబంధన మారింది. ఇకపై ఏడాది అనుభవం ఉన్నవారు ప్రిలిమినరీ స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, ప్రవేశ నిబంధనలను సడలించినప్పటికీ, ఎంపికైన అభ్యర్థులకు కఠినమైన శిక్షణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షలో ఎంపికైన వారు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ, పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఏడాది పాటు జ్యుడీషియల్ అకాడమీలో సమగ్ర శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు క్లర్క్షిప్ చేయాలి. దీనిలో మొదటి ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్/జిల్లా సెషన్స్ జడ్జి వద్ద, తర్వాతి ఆరు నెలలు హైకోర్టు జడ్జి వద్ద పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో వారి పనితీరును అంచనా వేసిన తర్వాతే తుది నియామకాన్ని ఖరారు చేస్తారు.



