Monday, August 24, 2026
E-PAPER
Homeఆటలుపడిక్కల్‌ సెంచరీ

పడిక్కల్‌ సెంచరీ

- Advertisement -

రాణించిన గిల్‌, జైస్వాల్‌, జడేజా
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 300/5
శ్రీలంకతో
రెండో టెస్టు తొలి రోజు

దేవదత్‌ పడిక్కల్ (177) వరుసగా రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజాలతో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన దేవదత్‌ పడిక్కల్‌ తొలి రోజు ఆటలో భారత్‌ను ముందంజలో నిలిపాడు. 85 ఓవర్లలో భారత్‌ 300 పరుగులు చేయగా, శ్రీలంక 5 వికెట్లు పడగొట్టింది. పేసర్‌ అషిత ఫెర్నాండో మూడు వికెట్లతో రాణించాడు. రిషబ్‌ పంత్‌ (3) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా.. నేడు ఉదయం సెషన్లో భారత్‌ వేగంగా పరుగులు జోడించటంపై గురిపెట్టనుంది. పిచ్‌ పేసర్లకు సహకరించినా, దేవదత్‌ పడిక్కల్‌ సెంచరీతో తొలి రోజు పైచేయి సాధించింది.

నవతెలంగాణ-కొలంబో
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో నయా నం.3 బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (117, 193 బంతుల్లో 12 ఫోర్లు) మరో సెంచరీతో కదం తొక్కాడు. పేస్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై మెప్పించిన దేవదత్‌ పడిక్కల్‌ తొలి రోజు ఆటలో భారత్‌ను ముందంజలో నిలిపాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50, 108 బంతుల్లో 6 ఫోర్లు), ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (45, 53 బంతుల్లో 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (43, 83 బంతుల్లో 4 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. కెఎల్‌ రాహుల్‌ (18) నిరాశపరచగా, రిషబ్‌ పంత్‌ (3) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించాడు. శ్రీలంక పేసర్‌ అషిత ఫెర్నాండో (3/46) మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి ధ్రువ్‌ జురెల్‌ (7 నాటౌట్‌), సరాంశు జైన్‌ (3 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచారు.

దేవదత్‌ జోరు
టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ పేస్‌కు అనుకూలించినా, తొలి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లు చెమటోడ్చారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (45), కెఎల్‌ రాహుల్‌ (18) తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. తొలి గంట బౌలర్లను నిలువరించిన ఓపెనర్లను లహిరు కుమార విడదీశాడు. కట్‌ షాట్‌ ఆడబోయిన రాహుల్‌.. వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 10.4 ఓవర్‌ వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 9 ఫోర్లతో దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్‌ మరోసారి అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. అషిత ఫెర్నాండో సంధించిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్లను గిరాటేయగా జైస్వాల్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో జతకట్టిన దేవదత్‌ పడిక్కల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. 209 బంతుల్లో ఈ జోడీ 120 పరుగులు జోడించింది. లంచ్‌ సెషన్లో ఆధిపత్యం చూపించిన పడిక్కల్‌, శుభ్‌మన్‌ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. పడిక్కల్‌ ఏడు ఫోర్లతో 90 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. శుభ్‌మన్‌ గిల్‌ 6 ఫోర్లతో 99 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. అర్థ సెంచరీ తర్వాత గిల్‌ వికెట్‌ నిలుపుకోలేదు. దీంతో లంచ్‌ సెషన్లో శ్రీలంక ఓ వికెట్‌ ఖాతాలో వేసుకుంది. 88/2తో లంచ్ సెషన్‌ను మొదలెట్టిన భారత్‌.. 187/3తో టీ విరామానికి వెళ్లింది.

గిల్‌ నిష్ర్కమణతో పడిక్కల్‌తో జతకట్టిన రిషబ్‌ పంత్‌ (3) వచ్చీ రాగానే తనదైన శైలిలో ర్యాంప్‌ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి గాయపడి మైదానం వీడాడు. పంత్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (43)తో కలిసి పడిక్కల్‌ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. 115 బంతుల్లో ఈ జోడీ 74 పరుగులు జోడించింది. 10 ఫోర్లతో పడిక్కల్‌ 168 బంతుల్లో సిరీస్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. జడేజా సైతం అర్థ సెంచరీ దిశగా సాగినా.. అషిత ఫెర్నాండో అతడికి బ్రేక్‌ వేశాడు. తొలి రోజు ఆఖర్లో దేవదత్‌ పడిక్కల్‌, రవీంద్ర జడేజా వికెట్లతో ఆతిథ్య శ్రీలంక ఊరట చెందింది.
కొలంబోలో భారత్‌ భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసేసరికి స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సరాంశు జైన్‌ క్రీజులో అజేయంగా నిలిచారు. రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్‌ పంత్‌ నేడు బ్యాటింగ్‌కు రానుండగా, మానవ్‌ సుతార్‌ రూపంలో మరో ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.

వేగంగా పరుగులు చేయటంలో పంత్‌, జురెల్‌కు తిరుగులేదు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తొలి సెషన్‌లో ఆడినా.. భారత్‌ అలవోకగా 100-150 పరుగులు జోడించగలదు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయటంపై దృష్టి నిలిపింది.కుల్‌దీప్‌ యాదవ్‌ రెండో టెస్టులో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. గాలె టెస్టులో ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌.. ఓ ఎండ్‌లో బ్యాటర్లపై ఒత్తిడి పెంచటంలో విఫలం అయ్యాడు. మానవ్‌ సుతార్‌, రవీంద్ర జడేజా మాయ చేసిన చోట కుల్‌దీప్‌ నిరాశపరిచాడు. దీంతో కొలంబోలో అతడి స్థానంపై అనుమానాలు రేగాయి. అనుకున్నట్టుగానే జట్టు మేనేజ్‌మెంట్‌ యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సరాంశు జైన్‌కు అరంగ్రేట అవకాశం కల్పించింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (బి) ఫెర్నాండో 45, కెఎల్‌ రాహుల్‌ (సి) డిక్వెలా (బి) కుమార 18, దేవదత్‌ పడిక్కల్‌ (బి) నువాంత 117, శుభ్‌మన్‌ గిల్‌ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50, రిషబ్‌ పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 3, రవీంద్ర జడేజా (బి) ఫెర్నాండో 43, ధ్రువ్‌ జురెల్‌ నాటౌట్‌ 7, సరాంశు జైన్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (85 ఓవర్లలో 5 వికెట్లకు) 300.
వికెట్ల పతనం : 1-37, 2-66, 3-186, 3-207 (పంత్‌), 4-281, 5-296.
బౌలింగ్‌ : అషిత ఫెర్నాండో 16-5-46-3, లహిరు కుమార 13-4-38-1, ప్రభాత్‌ జయసూర్య 27-4-90-0, కేశర నువాంత 22-0-93-1, సోనల్ దినుశ 1-0-2-0, ధనంజయ డిసిల్వ 2-0-8-0, కామిల్‌ మిశార 4-0-16-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -