Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంజమిలికి ఎన్డీఏ కసరత్తు!

జమిలికి ఎన్డీఏ కసరత్తు!

- Advertisement -

కూటమి అధికారంలో 
ఉన్న 22 రాష్ట్రాలు, యూటీల్లో అసెంబ్లీలు ముందుగానే రద్దు
ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత
రాజకీయ వర్గాల్లో 
మరోసారి తీవ్ర చర్చ
ఇప్పటికే జమిలిపై 
జేపీసీ విస్తృత సంప్రదింపులు
ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో నివేదిక సమర్పించే అవకాశం

2029లోనే ‘వన్‌ ‌నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’కు సమాలోచనలు

​న్యూఢిల్లీ: ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ (ఒకే దేశం.. ఒకే ఎన్నిక)ను 2034 నుంచి అమలు చేయాలన్న ప్రస్తుత ప్రతిపాదనను ‌కాస్త ముందుకు జరిపి 2029కి తీసుకురావడంపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఎన్డీఏ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల అసెంబ్లీలను వాటి పూర్తి పదవీకాలం ముగియకముందే రద్దు చేసి, 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పలు రాష్ట్రాల ప్రభుత్వాల పదవీకాలం గణనీయంగా కుదించాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం లోక్‌సభ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే జమిలి ఎన్నికలను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఎన్డీఏ ప్రయత్నాలకు సహకరించే పరిస్థితులు మాత్రం కనబడటం లేవు. దీంతో ‘వన్‌ ‌నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’పై రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జమిలి ఎన్నికలపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వర్గాలతో కమిటీ చర్చలు కొనసాగిస్తోంది. ఈ కమిటీ ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

​22 రాష్ట్రాలపై దృష్టి
ఎన్డీఏ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 11 చోట్ల 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో నాలుగు రాష్ట్రాలు ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకునే షెడ్యూల్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ పాలనలో ఉంది. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలను కూడా 2029 నాటికి ఒకే ఎన్నికల చక్రంలోకి తీసుకు రావడమే తాజా ఆలోచనగా తెలుస్తోంది.

​పదవీకాలం కుదింపు
2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించాల్సి ఉంటుంది. అలా అయితే గోవా, గుజరాత్‌, మణిపూర్‌, యూపీ, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీల పదవీకాలం సుమారు మూడేండ్లు ముందుగానే ముగిసే అవకాశం ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, రాజస్తాన్‌, త్రిపుర అసెంబ్లీల పదవీకాలం సుమారు నాలుగేండ్లు ముందుగానే ముగిసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఢిల్లీ విషయంలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలాన్ని సుమారు ఏడాది కుదించాల్సి ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జమిలి ఎన్నికలపై జేపీసీతో సమావేశమైన అనంతరం.. తమ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని తెలిపారు.

​ఎన్డీఏలో మద్దతు
జమిలి ఎన్నికల ఆలోచనకు కొంతమంది బీజేపీ ముఖ్యమంత్రులు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. గోవా, ఉత్తరాఖండ్‌, హర్యానా, ఢిల్లీ ముఖ్యమంత్రులు ఏకకాల ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ నిర్ణయం కేవలం రాజకీయ సమ్మతితోనే సాధ్యమవుతుందా? లేక రాజ్యాంగ, చట్టపరమైన మార్పులు అవసరమా? అన్నది కీలక ప్రశ్నగా మారుతోంది.

​అసలు వివాదం ఇక్కడే
జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రధాన వాదన ఏమిటంటే.. తరచూ జరిగే ఎన్నికల వల్ల ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా బలగాలు, రాజకీయ పార్టీలు భారీగా వనరులు వినియోగించాల్సి వస్తోంది. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ఖర్చు, పరిపాలనా అంతరాయాలను తగ్గించవచ్చని జమిలి ఎన్నికలను సమర్థించే బీజేపీ, దాని మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. అయితే దీనిని వ్యతిరేకించే కాంగ్రెస్‌ ‌సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య స్వతంత్రత, శాసనసభల పదవీకాలం, ప్రాంతీయ సమస్యలకు ఎన్నికల్లో లభించే ప్రాధాన్యం, ప్రభుత్వాల జవాబుదారీతనం వంటి అంశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నాయి.

​2029 చుట్టూ పొలిటికల్‌ ‌హీట్‌
ప్రస్తుతం జేపీసీ సంప్రదింపులు కొనసాగి స్తున్నప్పటికీ… 2029లోనే జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన నిజంగా కార్యరూపం దాల్చుతుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ చర్చ మొదలైతే మాత్రం 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూళ్లపై కూడా భారీ రాజకీయ పోరు తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఒకవైపు “ఒకే దేశం.. ఒకే ఎన్నిక” పేరుతో ఎన్నికల ఖర్చు, పరిపాలనా భారం తగ్గించాలన్న ఎన్డీఏ వాదన.. మరోవైపు రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులు, ప్రభుత్వాల జవాబు దారీతనం, అసెంబ్లీల సహజ పదవీకాలాన్ని కుదించడంపై ప్రతిపక్షాల అభ్యంతరాలు.. ఇలా ఈ రెండు వాదనల నడుమ 2029 నాటికి దేశ రాజకీయాల్లో మరో కీలక ‘రాజ్యాంగ–ప్రజాస్వామ్య’ చర్చకు జమిలి ఎన్నికలు తెరతీసే అవకాశముందని అంటున్నారు.

​చట్టం ఏం చెప్తోంది?
ప్రస్తుతం పార్లమెంటు పరిశీలిస్తున్న ప్రధాన బిల్లులు రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త లోక్‌సభ తొలి సమావేశం అనంతరం ఎన్నికయ్యే రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాలను అవసరమైతే కుదించి, తదుపరి ఎన్నికల చక్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం కల్పించాలనేది ఉద్దేశం. ఈ బిల్లులు ప్రస్తుత రూపంలో ఆమోదమైతే తొలి ఏకకాల ఎన్నికలు 2034లో జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి 2029కు ముందుకు తీసుకురావడం సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

​ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత
2029లోనే 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను లోక్‌సభ ఎన్నికలతో కలిపితే ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ దీనిని రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, జవాబుదారీతనానికి విరుద్ధమైనదిగా అభివర్ణించారు. కాంగ్రెస్‌, డీఎంకే తదితర పార్టీల ఎంపీలు 2024లోనే ఈ బిల్లులను వ్యతిరేకించారు. ఇంకా పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో 2027, 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో 2027లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటక, జోరం పీపుల్స్‌ ‌మూవ్‌‌మెంట్‌ (జెడ్‌‌పీఎం) పాలిత మిజోరంలలో 2028లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీల పదవీకాలం కూడా 2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి మూడేండ్లకు పైగా మిగిలి ఉంటుంది.

2029లోనే ఎన్నికలు ఎలా?
​ఎన్డీఏ వచ్చే రెండేండ్లలో తన రాష్ట్ర ప్రభుత్వాలను కొనసాగించగలిగితే.. 22 రాష్ట్రాలు, యూటీల అసెంబ్లీలను 2029 జనవరి నాటికి రద్దు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 174(2)(బీ) ప్రకారం అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం సలహా మేరకు గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేస్తారు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన సందర్భంలోనూ ఈ అధికారం ఉపయోగించవచ్చు. అసెంబ్లీ రద్దైన తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -