Monday, August 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా ఆధిపత్యానికి చైనా సవాల్‌

అమెరికా ఆధిపత్యానికి చైనా సవాల్‌

- Advertisement -

ఆర్థిక రంగంలో బీజింగ్‌ దూకుడు
నామినల్‌ జీడీపీలో యూఎస్‌ ముందంజ..
పీపీపీలో చైనాదే అగ్రస్థానం
నాలుగు దశాబ్దాల్లో అంచనాలకు అందని ఎదుగుదల..
అమెరికాతో ఆర్థిక అంతరాన్ని వేగంగా తగ్గించిన చైనా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇరు దేశాల హోరాహోరీ

​ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు దూరంగా నిలిచిన చైనా..ఇప్పుడు అదే దేశానికి ప్రధాన ఆర్థిక ప్రత్యర్థిగా మారింది. నామినల్‌ జీడీపీలో అమెరికా ఇంకా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకునే పీపీపీ కొలమానంలో చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించింది. గత నాలుగు దశాబ్దాల్లో అంచనాలకు అందని ఎదుగుదలను నమోదు చేసింది. అగ్రరాజ్యంగా ప్రచారం చేసుకుంటున్న అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చైనా సాధించిన ఈ ఆర్థిక ప్రస్థానం ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాన్ని ఇస్తోందని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు.

వాషింగ్టన్‌, బీజింగ్‌ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యానికి చైనా క్రమంగా సవాల్‌ విసురుతోంది. 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రెండు శక్తులుగా అమెరికా, చైనా నిలిచాయి. ప్రపంచ జీడీపీలో ఈ రెండు దేశాల వాటా కలిపి నామినల్‌ లెక్కల్లో 42.15 శాతంగా, పీపీపీ ప్రాతిపదికన 34.42 శాతంగా ఉంది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం వరకు ప్రభావం చూపగల స్థాయి లో ఈ రెండు దేశాలు ఉన్నాయి. అయితే ఈ పోటీలో చైనా ఎదుగుదలే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

నామినల్‌ జీడీపీలో 
అమెరికా.. పీపీపీలో చైనా
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 2026 అంచనాల ప్రకారం… నామినల్‌ జీడీపీలో అమెరికా 32.384 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇందులో చైనా జీడీపీ 20.851 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా. ఈ లెక్కన అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనా కంటే సుమారు 1.55 రెట్లు పెద్దది. రెండు దేశాల మధ్య సుమారు 11.532 ట్రిలియన్‌ డాలర్ల తేడా ఉంది. కానీ దేశీయ ధరలు, ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకునే పర్చేజింగ్‌ ‌పవర్‌ ‌ప్యారిటీ (పీపీపీ) లెక్కల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పీపీపీ ఆధారంగా చైనా జీడీపీ 44.295 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా. అమెరికా జీడీపీ 32.384 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే పీపీపీ పరంగా చైనా… అమెరికా కంటే సుమారు 1.37 రెట్లు పెద్దది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలోని భారీ దేశీయ ఉత్పత్తి, వినియోగ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

​1960లో 11 శాతం.. ఇప్పుడు 64 శాతం!
చైనా ఎదుగుదల ఎంత వేగంగా సాగిందో అమెరికాతో జీడీపీ పోలికే చెప్తుంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం… 1960లో చైనా జీడీపీ.. అమెరికా జీడీపీలో కేవలం 11 శాతం మాత్రమే. 1987లో ఈ నిష్పత్తి మరింత తగ్గి 5.6 శాతానికి చేరింది. అయితే ఆ తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించింది. 2026 నాటికి చైనా జీడీపీ అమెరికా జీడీపీలో 64 శాతానికి చేరింది. అంటే ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉన్న చైనా.. కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద నామినల్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇదే చైనా ఆర్థిక పరివర్తన ఎంత భారీగా జరిగిందో సూచించే ముఖ్యమైన గణాంకమని విశ్లేషకులు వివరిస్తున్నారు.

అమెరికా కంటే వేగంగా పరిగెత్తిన చైనా
ఆర్థిక వృద్ధి రేట్లను పరిశీలించినా చైనా దూకుడు స్పష్టమవుతుంది. 1961 నుంచి 2024 మధ్య చైనా 22 ఏండ్లలో 10 శాతానికి పైగా జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. చైనా అత్యధిక వృద్ధి రేటు 1970లో 19.30 శాతం. అమెరికా అత్యధిక వృద్ధి రేటు మాత్రం 1984లో 7.24 శాతమే. అంటే చైనా అభివృద్ధి దశలో సాధించిన వృద్ధి వేగం అమెరికా నమోదు చేసిన అత్యధిక వార్షిక వృద్ధి రేటుతో పోల్చి నా చాలా ఎక్కువ. చైనా మొత్తం ఆర్థిక పరిమా ణంలో అమెరికాకు చేరువవుతున్నప్పటికీ… ప్రజల సగటు ఆదాయాన్ని కొలిచే తలసరి జీడీపీలో మాత్రం అమెరికా ముందుంది. అయితే చైనా జనాభా అమెరికా కంటే నాలుగు రెట్లకు పైగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.

​‘అమెరికానే నంబర్‌ వన్‌’ అన్న భావనకు సవాల్‌
దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా ఆధిపత్యమే అన్న భావన బలంగా ఉంది. డాలర్‌ ఆధిపత్యం, భారీ వినియోగ మార్కెట్‌, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రభావం, సాంకేతిక రంగంలో ఆధిపత్యం అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. కానీ చైనా ఎదుగుదల ఆ సమీక రణాన్ని మార్చుతోందని గణాంకాలే చెప్తున్నాయి. పీపీపీ లెక్కల్లో ఇప్పటికే అమెరికాను అధిగ మించడం, నామినల్‌ జీడీపీలో అంతరాన్ని తగ్గిం చడం, గత దశాబ్దాల్లో అధిక వృద్ధి రేట్లు నమోదు చేయడం ద్వారా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని గణనీయంగా పెంచుకుంది.

​చైనా ఎదుగుదల.. 
ప్రపంచానికి కొత్త సమీకరణాలు
చైనా ఎదుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యం క్రమంగా సవాల్‌కు గురవుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. చైనా.. పీపీపీలో ముందుండటం, అమెరికాతో జీడీపీ అంతరాన్ని తగ్గించడం, భారీ దేశీయ మార్కెట్‌ను కలిగి ఉండటం వంటి అంశాలు భవిష్యత్తులో బీజింగ్‌ అగ్ర ఆర్థిక వ్యవస్థ కుర్చీని సొంతం చేసు కోగలదన్న విశ్వాసాన్ని ఆర్థిక విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 21వ శతాబ్దపు ఆర్థిక పోటీని కేవలం “అమెరికా వర్సెస్‌ చైనా”గా కాకుండా.. “పాత ఆర్థిక ఆధిపత్యం (అమెరికా), వేగంగా ఎదు గుతున్న కొత్త ఆర్థిక శక్తి (చైనా) మధ్య పోటీ’’గా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -