Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగ విలువలను కాపాడటంలో మీడియా పాత్ర కీలకం

రాజ్యాంగ విలువలను కాపాడటంలో మీడియా పాత్ర కీలకం

- Advertisement -


 ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌ప్రెస్‌‌క్లబ్స్‌ 
‌జాతీయ సదస్సులో జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, నిష్పాక్షికత, వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత పరస్పరం ముడిపడి ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. మీడియా సంస్థలు తమ స్వీయ నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు, జర్నలిస్టుల కోసం పారదర్శకమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని సూచించారు.ఆదివారం
హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌ జాతీయ సదస్సులో నిర్వహించిన ప్యానెల్‌ చర్చలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ది కారవాన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హర్తోష్ సింగ్ బాల్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి ప్యానలిస్టులుగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు, ది వైర్ మాజీ నేషనల్ అఫైర్స్ ఎడిటర్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సంగీత బరూవా పిషారోటి మోడరేటర్‌గా వ్యవహరించారు.ప్రజల సమష్టి అధికారాన్ని ప్రజాప్రతినిధులు, రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రభుత్వ శాశ్వత యంత్రాంగం ఎలా వినియోగిస్తున్నాయి? దాని పరిణామాలు ఏమిటి? అనే అంశాలను ప్రజలకు తెలియజేయడం మీడియా ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని, అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయం, వ్యక్తిగత గౌరవం, సమాజ సంక్షేమం వంటి విస్తృత రాజ్యాంగ విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ కూడా భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగంగానే అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు వాస్తవాలను ప్రతిబింబించే అద్దంలా మీడియా వ్యవహరించాల్సి ఉండగా, దాని పాత్ర క్రమంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న చర్చను కేవలం వ్యక్తిగత భావ ప్రకటనా స్వేచ్ఛకే పరిమితం చేయకుండా, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణతో అనుసంధానించి చూడాల్సిన అవసరం ఉందన్నారు. మీడియాలోని గణనీయమైన భాగం పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, వ్యాపార ప్రయోజనాలు కలిగిన వర్గాల ఆధీనంలోకి వెళ్లిందని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల మధ్య ఏర్పడుతున్న సంబంధాల ప్రభావంతో మీడియా ‘వాచ్‌డాగ్‌’ పాత్ర బలహీనపడుతోందన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన మీడియా సంస్థలే కొన్నిసార్లు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను మీడియా కూడా తన విధుల్లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్‌ మీడియా కూడా పూర్తిగా స్వేచ్ఛకు ప్రత్యామ్నాయ వేదికగా మారలేదని వ్యాఖ్యానించారు.
ఆదేశిక సూత్రాలు నేరుగా న్యాయస్థానాల్లో అమలు చేయించుకోలేనివైనా, అవి రాజ్యాంగ పాలనకు ప్రాథమిక పునాదులని చెప్పారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరి ప్రజల ప్రాథమిక హక్కులనే దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే న్యాయవ్యవస్థ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా, జర్నలిస్టులు లోతైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అణగారిన వర్గాలు, నిరాశ్రయులు, వెనుకబడిన ప్రజలు, తమ సమస్యలను వినిపించుకోలేని వర్గాలకు మీడియా వేదికగా నిలవాల్సి ఉందన్నారు. రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి యజమానుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ, పారదర్శకత, నిష్పాక్షికత, వాస్తవ నిర్ధారణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -