Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు

ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు

- Advertisement -


ఇజ్రాయిల్‌కు ఏడు దేశాల హితవు
న్యూఢిల్లీ :
ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ టెండర్లను ఆహ్వానించాలన్న ఇజ్రాయిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, కెనడా వ్యతిరేకించాయి. ఇజ్రాయిల్ నిర్ణయం ఆమోదయోగ్య కాదని తేల్చి చెప్పాయి. ఈ ప్రణాళికను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెస్ట్‌బ్యాంక్‌లో సెటిల్మెంట్ల విస్తరణను నిలిపివేయాలని ఇజ్రాయిల్‌ను కోరాయి. ఈ మేరకు ఆయా దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘ఈ-1 సెటిల్మెంట్ వెస్ట్‌బ్యాంక్‌లో విభజనను సృష్టించి పాలస్తీనా భూభాగాల ప్రాదేశిక అవిచ్ఛిన్నతకు హాని కలిగిస్తుంది. తద్వారా రెండు దేశాల పరిష్కారానికి ఉన్న అవకాశాలను దెబ్బతీస్తుంది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సెటిల్మెంట్లు చట్టవిరుద్ధమని అంతర్జాతీయ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఇది అంతర్జాతీయ సమాజం యొక్క వైఖరి. దీనిని ఐరాస భద్రతా మండలి కూడా పునరుద్ఘాటించింది’ అని ఆ ప్రకటనలో వివరించారు.
వెస్ట్‌బ్యాంక్‌లో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పౌరులపై సెటిలర్లు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నారని, పాలస్తీనా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, ఇలాంటి పరిస్థితులలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆ దేశాలు తమ సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ఇలాంటి చర్యలు శాంతికి విఘాతం కలిగిస్తాయని, ఇజ్రాయిల్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీస్తాయని హెచ్చరించాయి. నిర్మాణ టెండర్ల కోసం బిడ్లు వేయవద్దని వ్యాపార సంస్థలను కోరాయి.

ఈ-1 అంటే..
జెరుసలేంకు తూర్పున ఉన్న ఈ-1 అనే బహిరంగ భూభాగంలో సెటిల్మెంట్ అభివృద్ధి అంశం రెండు దశాబ్దాలకు పైగా పరిశీలనలో ఉంది. అయితే గత ప్రభుత్వాల హయాంలో అమెరికా ఒత్తిడి కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సెటిల్మెంట్ల నిర్మాణం చట్టవిరుద్ధమని, శాంతికి ఆటంకమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కొత్త సెటిల్మెంట్ అవిచ్ఛిన్నమైన పాలస్తీనా రాజ్య ఏర్పాటును నిరోధిస్తుందని విమర్శకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -